Monday, April 29, 2024

ఏపీలో ఇవాళ.. రేపు వర్షాలు.. బయటకు రావద్దని అధికారుల వార్నింగ్..

వర్షాకాలం ముగిసింది. చలికాలం స్టార్ట్ అయింది. అయినా ఏపీని వరుణుడు వదలడం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు, ఆవర్తన ద్రోణుల కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ (శనివారం), రేపు (ఆదివారం) రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. ఈ అల్పపీడనం శుక్రవారం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని అధికారులు పేర్కొన్నారు. అంతే కాకుండా సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని తెలిపారు. అల్పపీడనం, ఉపరితల ఆవర్తన ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.

కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 45 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లా తీరప్రాంతం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు ఎగసి పడుతున్నాయి. సముద్రం దాదాపు 10 మీటర్లు ముందుకొచ్చింది.అయితే.. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది వాయువ్య దిశగా తమిళనాడు పుదుచ్చేరి తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు.. ఈనెల 13 న తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం లేదా ఉపరితల ఆవర్తనం గా ప్రవేశించే అవకాశం ఉంది.దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయి. అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప, సత్యసాయి జిల్లాల్లో ఈనెల 15 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్న ప్రకటనతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ అయింది. లోతట్టుప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement