Monday, April 29, 2024

ప్రశ్నార్ధకంగా మత్స్యకార సొసైటీలు.. ఇప్పటికే పలు సబ్సిడీలకు మంగళం..

కృష్ణా రూరల్‌, ప్రభన్యూస్ : చేపల వేట ప్రధాన వృత్తిగా జీవనం సాగిస్తున్న మత్స్యకార కుటుంబాలకు మళ్లీ కష్టమొచ్చింది. తరతరాలుగా, వారసత్వంగా, హక్కుగా వస్తున్న చేపల వేటలో ఉన్న మత్స్యకారులకు ప్రాణసంకటంగా జీవో నెంబర్‌ 217 పరిణమించింది. చెరువుల లీజు పద్ధతి స్థానంలో వేలంపాట నిర్వహించాలనీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచాల్సిన ప్రభుత్వం వారి జీవనాధారాల పై వేటు వేయడం తగడంటు ప్రతిపక్షాలు తూర్పార బడుతున్నాయి. ఇప్పటికే గత ప్రభుత్వం అందిస్తున్న రాయతిలని ప్రభుత్వం ఎత్తివేయడంతో వరి పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న తరుణంలో, అభివృద్ధి, సంక్షేమం అంటూ మత్స్యకార సొసైటీలు కనుమరుగయ్యేలా చర్యలు తీసుకోవడం దారుణం అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది తీసుకువచ్చిన జీవోకు తాజాగా గెజిట్‌ నోట్‌ ను రిలీజ్‌ చేసిన ప్రభుత్వం ఈ ఏడాది నుండి అమలు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతు, అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు. సొసైటీలు కనుమరుగు కానున్నయా..: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జీవో నెంబర్‌ 217 తో మత్స్యకార సొసైటీ కనుమరుగు కానున్న అనే అనుమానాలు మత్స్యకారుల నుండి వ్యక్తమవుతున్నాయి.

సబ్సిడీ పరికరాలు చేప పిల్లలు, వాహనాలు సబ్సిడీపై ఇవ్వాల్సిన ప్రభుత్వం వాటిని ఇవ్వకుండా ఇప్పుడు చెరువులను తమ చెప్పుచేతల్లోకి తీసుకుని వేలంపాట ద్వారా మత్స్యకారుల జీవనాధారాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు. కరోనాతో అసలే కష్టాల్లో ఉన్న మత్స్యకారులను, సొసైటీలను ఆదుకుని, వారికి ఆర్థిక పరిపుష్టి ఇవ్వాల్సిన ప్రభుత్వం వారి పొట్ట కొట్టడం తగదంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మత్స్యకారుల సంక్షేమం పేరుతో వారి జీవన ప్రమాణాలు పెంచేందుకే అంటూ తీసుకువచ్చే జీవో నెంబర్‌ 217 మొదట్లో పైలెట్‌ ప్రాజెక్టుగా చెప్పి, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధం అవుతోందని వారు విమర్శిస్తున్నారు. తరతరాలుగా చేపల వేట చేసుకుంటూ జీవనం గడుపుతున్న సమయంలో కొత్తగా వేలం నిర్వహించి తద్వారా వారికి నచ్చిన వారికి అప్పగించే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. గడచిన రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం నుండి ఎటువంటి రాయితీలు అందకపోగా, ఇప్పుడు వస్తున్న జీవోతో మొత్తం ఆదాయం కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. జీవో నెంబర్‌ 217 తో ప్రస్తుతం 100 ఎకరాలు దాటిన చెరువులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించి వచ్చిన ఆదాయంలో 40 శాతం నీటి పారుదల శాఖకు, 30 శాతం సొసైటీలకు, ఆఫ్కాబ్‌ కు 20 శాతం, పంచాయతీలకు 10 శాతం చొప్పున ఇవ్వనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement