Monday, May 6, 2024

శ్రీశైలంలో విద్యుదుత్పత్తి.. ఆంక్షలకు సిద్ధమవుతున్న కృష్ణా బోర్డు

అమరావతి, ఆంధ్రప్రభ : రెండు తెలుగురాష్ట్రాల మధ్య గత ఏడాది జలవివాదాలకు కేంద్ర బిందువైన శ్రీశైలంలో విద్యుదుత్పత్తి అంశం ఇపుడు కూడా అగ్గి రాజేస్తోంది. అనుమతి లేకుండా ఎప్పుడంటే అపుడు ఇష్టారీతిన శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తోడేసి విద్యుదుత్పత్తి చేయటంపై ఈ ఏడాది నిర్టిష్టమైన నిబంధనలు, ఆంక్షలు విధించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) నిర్ణయించింది. ఈ మేరకు బోర్డు పరిధిలోని రిజర్వాయర్‌ మేనేజ్‌ మెంట్‌ కమిటీ- (ఆర్‌ఎంసీ) కి మార్గదర్శకాలు జారీ చేసింది. ఆర్‌ ఎంసీ ఇప్పటికే నియమావళి రూపొందించినట్టు సమాచారం. రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో దీనిపై సంప్రదించేందుకు వీలుగా గడిచిన నెలరోజులుగా బోర్డు సమావేశాలు నిర్వహించింది. సమావేశాలకు తెలంగాణ నీటిపారుదల ఉన్నతాధికారులు ముఖం చాటేస్తుండగా ఏపీ అధికారులు మాత్రమే హాజరవుతున్నారు. ఈనెల 6న ఆర్‌ఎంసీ చివరి సమావేశం ఉంటుందనీ.. ఈసారి కూడా తెలంగాణ అధికారులు గైర్హాజరయితే తాము తీసుకునే కీలక నిర్ణయాలకు కట్టుబడాల్సి ఉంటుందని బోర్డు విస్పష్టంగా వెల్లడించింది. గత నెల 30న హైదరాబాద్‌ జలసౌధలో నిర్వహించిన రివర్‌ మేనేజ్‌ మెంట్‌ కమిటీ రెండవ సమావేశానికి హాజరయిన ఏపీ జల వనరులశాఖ, ఏపీ జెన్‌కో అధికారులు శ్రీశైలంలో విద్యుదుత్పత్తిపై ఏపీ ప్రభుత్వ వైఖరిని బోర్డుకు తెలియచెప్పారు. శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల కన్నా తక్కువ నీరున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడి చేయాలని ఆర్‌ ఎంసీ కన్వీనర్‌ ఆర్కే పిళ్ళై, బోర్డు సభ్యుడు ముయన్తంగ్‌ దృష్టికి తీసుకొచ్చారు. శ్రీశైలంతో పాటు దానికన్నా దిగువన ఉన్న ఉమ్మడి ప్రాజెక్టు నాగార్జున సాగర్‌ లో విద్యుత్పత్తి నియమావళిపైనా చర్చించారు. ఏపీ సాగునీటి హక్కులకు రక్షణ కల్పించేలా విద్యుదుత్పత్తిపై తెలంగాణకు ఆదేశాలు జారీ చేయాలనీ, కఠిన ఆంక్షలను విధించాలని కోరారు. అంతేకాదు..సముద్రం పాలవుతున్న వరద జలాలను మళ్లించి ఏ రాష్ట్రం వినియోగించుకున్నా వాటిని నికరజలాల్లో కలపకూడదని ఏపీ స్ఫష్టం చేసింది. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా గాలేరు-నగరి, తెలుగుగంగ, హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలని కోరారు.

బచావత్‌ ను ఉల్లంఘిస్తున్న తెలంగాణ..

రిజర్వాయర్లలో నీటి వినియోగంపై బచావత్‌ -టైబ్యునల్‌ పొందుపర్చిన ప్రోటోకాల్‌ ను తెలంగాణ ప్రభుత్వం యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నా బోర్డు మౌనం వహించటంపై ఏపీ ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తోంది. కనీసం ఈ ఏడాదయినా చట్టబద్ధత ఉన్న ప్రోటోకాల్‌ ను అమలు చేయాలని కోరుతోంది. బచావత్‌ -టైబ్యునల్‌ ప్రోటోకాల్‌ ప్రకారం తాగునీరు, సాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. సాగునీటి అవసరాలు ఉన్నపుడు మాత్రమే విద్యుదుద్పత్తి చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. నదికి దిగువన ఉన్న రాష్ట్ర అవసరాల ఆధారంగానే ఎగువున ఉన్న రాష్ట్రం విద్యుదుత్పత్తి చేయాలి. దిగువ రాష్ట్ర అవసరాలతో సంబంధం లేకుండా విద్యుదుత్పత్తి చేసి నీటిని వదిలేస్తే అవన్నీ సముద్రం పాలవుతాయి..గత ఏడాది తెలంగాణ ఈ తరహా ఉల్లంఘనలకే పాల్పడింది. గత ఏడాది ఏపీకి సాగునీటి అవసరాలు లేని సమయంలో జులై 2 నుంచి 20 వరకు కేవలం 18 రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం నీటిమట్టం కనిష్ట స్థాయికి చేరే వరకు యధేచ్ఛగా ఎడమగట్టు పవర్‌ హౌస్‌ ద్వారా విద్యుదుత్పత్తి చేసింది. ఫలితంగా కేవలం 18 రోజుల్లోనే 11.3 టీ-ఎంసీల నీరు సముద్రం పాలైంది. ఆ సమయంలో నీరు వృధా కాకుండా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్ల్రో సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు అందేదని అంచనా. కృష్ణా బోర్డు లెక్కల ప్రకారం..2021-22 నీటి సంవత్సరంలో 218 టీఎంసీలను 281 రోజులపాటు తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకుని 1217 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసింది. దీనిపై గత ఏడాది రెండు రాష్ట్రాల్ర మధ్య తీవ్రస్థాయి వివాదాలు తలెత్తాయి. దీనిపై ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖలు కూడా రాశారు. ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకురావాలని కూడా కోరటంతో గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదలైంది. గెజిట్‌ ఇంకా అమలుకు నోచుకోనప్పటికీ శ్రీశైలంలో విద్యుదుత్పత్తి వివాదం మాత్రం రెండు రాష్ట్రాల్ర మధ్య కొనసాగుతూ ఉంది. ఈనేపథ్యంలో ఈనెల 6న నిర్వహించనున్న సమావేశానికి తెలంగాణ అధికారులు హాజరవుతారా, లేదా అనే అంశంతో పాటు బోర్డు తీసుకునే నిర్ణయాలపై అధికారవర్గాల చర్చించుకుంటున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement