Monday, April 29, 2024

అనంతలో సీఎం జగన్ పర్యటన… జిల్లావ్యాప్తంగా ముందస్తు అరెస్టులు

ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు,  విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. సీఎం  పర్యటనను అడ్డుకునేందుకు బయలుదేరిన చంద్రదండు, తెలుగు యువత నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ను విద్యార్థి, యువజన సంఘాలు, తెలుగు యువత నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం పర్యటనను అడ్డుకుంటామని నాయకులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అరెస్టును చంద్రదండు, విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు.

మరోవైపు ఇవాళ సీఎం జగన్ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళం గ్రామం, రాయదుర్గం పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సీఎం జగన్ రాక సందర్భంగా పోలీసులు రాయదుర్గంలో విస్తృతమైన బందోబస్తు చేపట్టారు. దాదాపు 2 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. సీఎం జగన్ పర్యటనలో పాల్గొనేందుకు ఇప్పటికే జిల్లాకు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, పశుసంవర్ధక శాఖ మంత్రి అప్పలరాజు చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement