Thursday, March 28, 2024

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇకపై తెలుగులోనూ ఇంజినీరింగ్ కోర్సులు

ఇంజినీరింగ్ చదవాలనుకునే వారికి శుభవార్త. ఇంగ్లీష్‌లోనే ఉన్న ఇంజినీరింగ్ కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రాంతీయ భాషలైన హిందీ, తెలుగు, తమిళం, మరాఠీలో బోధించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) కాలేజీలకు అనుమతి ఇచ్చింది. మొత్తం 11 భాషల్లోకి కోర్సులను అనువాదం చేస్తున్నారు. భాష కారణంగా ఏ విద్యార్థి తాను కోరుకున్న చదువుకు దూరం కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామంది. ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్ చదువుతున్నప్పటికీ నాలుగేళ్లు ఇంగ్లీష్ తప్పనిసరి సబ్జెక్టుగా ఉండనుంది. ఫ్యాకల్టీని బట్టి కాలేజీలు భిన్న భాషల్లో కోర్సులను అందించవచ్చు. ప్రాంతీయ భాషల్లో కోర్సులను అందించాలంటే కాలేజీకి ఎన్‌బీఏ గుర్తింపు ఉండాలి.

ఈ ఏడాది మొదట్లో ఏఐసీటీఈ సర్వే నిర్వహించగా దాదాపు సగం మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు తాము మాతృభాషలో చదవాలని అనుకొంటున్నట్టు చెప్పారు. అనంతరం ప్రాంతీయభాషలో ఇంజనీరింగ్‌ కోర్సుల బోధనపై ప్రొఫెసర్‌ ప్రేమ్‌ విరాట్‌ అధ్యక్షతన కమిటీ వేశారు. ఎన్‌ఐటీలు, ఐఐటీలు, ఏఐసీటీఈ అనుబంధ కాలేజీల్లో ప్రాంతీయ భాషల్లో కోర్సులను ఎంచుకోవడానికి విద్యార్థులకు ఆప్షన్‌ ఉండాలని ఈ కమిటీ సూచించింది. తెలుగులో బోధించేందుకు ఫ్యాకల్టీ లేరని ఐఐటీలు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రాంతీయ భాషల్లో విద్యాబోధనకు ఇప్పటివరకు 9 రాష్ర్టాల్లో 14 కాలేజీలు ఆసక్తిచూపాయి. ఈ నేపథ్యంలోనే ప్రాంతీయ భాషల్లో విద్యాబోధనకు ఏఐసీటీఈ కాలేజీలకు అనుమతినిచ్చింది.

ఈ వార్త కూడా చదవండి: ఆధార్ కార్డు యూజర్లకు అలర్ట్

Advertisement

తాజా వార్తలు

Advertisement