Saturday, May 4, 2024

Delhi: మా పార్టీ, ప్రభుత్వం మహిళా పక్షపాతి.. మాధవ్ తప్పు చేశారని తేలితే చర్యలుంటయ్​: వైసీపీ ఎంపీలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తప్పు చేశారని తేలితే రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకుంటుందని రాజమండ్రి వైఎస్సార్సీపీ ఎంపీ, పార్లమెంట్ చీఫ్ విప్ మార్గాని భరత్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన వైసీపీ ఎంపీలు ఆర్. కృష్ణయ్య, చింతా అనురాధతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ… ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి ఎనిమిదేళ్లు గడిచినా ఇప్పటివరకు దానిపై దిక్కూ మొక్కూ లేదని విమర్శించారు. చిన్నవాళ్లకైతే ఓ చట్టం, పెద్దవాళ్లకు మరో రకం చట్టమా? అని ప్రశ్నించారు. గోరంట్ల మాధవ్ విషయంలో మహిళా కమిషన్ నివేదిక కోరిందని, ఫోరెన్సిక్ విచారణ జరిపించాలని ఆయన కూడా కోరుతున్నారని భరత్ చెప్పుకొచ్చారు.

తమ పార్టీ, ప్రభుత్వం మహిళా పక్షపాతి అన్న ఆయన, ఏ మహిళకు ఇబ్బంది తలెత్తినా కచ్చితంగా చర్యలు ఉంటాయని నొక్కి చెప్పారు. తప్పని తేలితే చర్యలు తీసుకోడానికి తమ పార్టీ ఏమాత్రం వెనుకాడదని అన్నారు. నివేదిక వచ్చే వరకు నిందితుణ్ణి దోషిగా ముద్ర వేయలేమని స్పష్ట్ చేశారు. ఈ విషయంలో ఏ మహిళా ముందుకొచ్చి ఫిర్యాదు చేయలేదని భరత్ వెల్లడించారు. నివేదిక వచ్చాక తప్పని తేలితే మాత్రం చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. స్పీకర్‌కు టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేయడంపైనా ఆయన స్పందించారు. వీడియో నిజమో, కాదో అన్నది నిర్థారణ కానప్పుడు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని భరత్ అన్నారు.

మీతోనే కాదు అందరితో ప్రధాని మాట్లాడారు
చంద్రబాబు-మోదీ మంతనాల మీదా ఆయన స్పందించారు. బాబుతో మోదీ పది నిమిషాలు మాట్లాడారని, ఢిల్లీకి రండి అని ఆహ్వానించారని కథనాలు అల్లారంటూ ఎద్దేవా చేశారు. ఆయన ప్రధాని అనుకుంటున్నారా.. లేక ఏమనుకుంటున్నారని ప్రశ్నించారు. సీఎంగా ఉన్నప్పుడే అపాయింట్మెంట్ ఇవ్వని వ్యక్తి, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న మీకు ఢిల్లీ రాగానే కారు పంపిస్తానని అంటారా అని భరత్ నిలదీశారు. సమావేశానికి వచ్చిన గెస్టులందరితో ప్రధాని మాట్లాడారన్న భరత్, ఈ సమయంలో చంద్రబాబు అటు పక్కగా వెళ్లి ఆయనతో మాట్లాడినట్టున్నారని చెప్పుకొచ్చారు. అనుకూల మీడియాలో ఏదేదో రాయించుకున్నారని ఆయన విమర్శించారు.

నిధులు-బకాయిల విడుదలకు వినతి
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చాలా ముఖ్యమైన అంశాల మీద చర్చించామని, ధరల పెరుగుదలపై జరిగిన చర్చలో ప్రజల ఇబ్బందుల గురించి మాట్లాడామని భరత్ తెలిపారు. నిత్యవసరాలు, వంట నూనెలు, గ్యాస్, పెట్రోల్ ధరలను నియంత్రించాలని పార్టీలన్నీ కోరాయని చెప్పారు. ఏ వ్యవసాయ ఉత్పత్తులనైతే మనం దిగుమతి చేసుకుంటున్నామో, వాటిని దేశంలో పండించేలా రైతులకు ప్రోత్సాహకాలు కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు గడిచినా ఎన్డీఏ వ్యవసాయ ఉత్పత్తుల స్వయం సమృద్ధిపై ఎందుకు దృష్టి సారించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందని, పవన, సౌర, జల విద్యుత్ కాంబినేషన్లలో ఏపీ ప్రభుత్వం పని చేస్తోందని ఎంపీ వెల్లడించారు.

రాష్ట్రంలో పర్యటించాల్సిందిగా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి, సహాయ మంత్రిని కోరామని తెలిపారు. ఆహార భద్రతా చట్టం ప్రకారం కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ వంటి రాష్ట్రాల్లో దాదాపు 76 శాతం మందిని దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కేటగిరీ కింద కేంద్రం ఆహారధాన్యాలు ఇస్తోందన్న ఆయన, అదే పద్ధతిన ఆంధ్రప్రదేశ్‌కు కూడా 76 శాతం బీపీఎల్ కింద పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఎఫ్‌ఆర్బీఎం పరిమితిలో కోత పెట్టారన్న భరత్, ఏపీని ప్రత్యేక దృష్టితో చూడాలని విజ్ఞప్తి చేశారు. విభజన నాటికి ఏపీలో రెవెన్యూ లోటుగా రూ. 22 వేల కోట్లని కాగ్ నివేదిక పేర్కొందని గుర్తు చేశారు. కానీ కేంద్రం రూ. 4 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని, మిగతా మొత్తాన్ని ఒక్కసారిగా ఇవ్వాలని భరత్ కేంద్రాన్ని కోరారు. ఏపీలోని విద్యుత్ సంస్థలకు రూ. 6,600 కోట్లు తెలంగాణ నుంచి రావాల్సి ఉందని, ఈ బకాయిలను చెల్లించేలా తెలంగాణ ప్రభుత్వంతో కేంద్రం సంప్రదింపులు చేసి నిధులు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

- Advertisement -

పోలవరం నిధులు దుర్వినియోగం కాలేదు
పోలవరం నిధులు దుర్వినియోగం అయ్యాయా అని టీడీపీ ఎంపీ పార్లమెంటులో అడిగిన ప్రశ్నలకు అలాంటిదేమీ లేదని కేంద్రం స్పష్టంగా సమాధానమిచ్చిందని భరత్ వెల్లడించారు. టీడీపీ ఎంపీ ప్రశ్నలో దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన విమర్శించారు. నిధులు విడుదల చేయకుండా అడ్డుకోవడమే వారి లక్ష్యమని దుయ్యబట్టారు. కాఫర్ డ్యామ్ పూర్తికాకుండా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టకూడదన్న ఎంపీ, చంద్రబాబు ఇలా చేయడం వల్ల డయాఫ్రమ్ వాల్ ఫౌండేషన్ అక్కడక్కడా దెబ్బతిన్నదని వివరించారు. రిజర్వాయర్‌లో నీరు నిలవాలంటే డయాఫ్రమ్ వాల్ పటిష్టంగా ఉండాలని, కానీ చంద్రబాబు అనాలోచిత నిర్ణయం వల్ల రేపు ఏదైనా ప్రమాదం తలెత్తితే డౌన్ స్ట్రీమ్‌లో ఉన్న మండలాలు, గ్రామాలు ఏమైపోతాయో ఆలోచించండని సూచించారు.

యూపీ మాదిరిగా ఏపీకి సహకరించాలి
అనంతరం ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ… ఏపీ సీఎం జగన్ సమాజ వికాసానికి ఏం కావాలో అది చేస్తున్నారని చెప్పుకొచ్చారు. శాశ్వత అభివృద్ధికి అవసరమైన విద్యాబోధనపై పథకాలు అమలు చేస్తున్నారన్న ఆయన, పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ఉంటుందని జోస్యం చెప్పారు. కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా రుణ పరిమితిపై ఆంక్షలు పెడుతోందని వాపోయారు. యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సహకరిస్తున్నారో ఏపీకి సహకరించాలని కోరారు. కేంద్రం రాష్ట్రానికి తగినంత సహాయ సహకారాలు అందించట్లేదని రాష్ట్ర ప్రభుత్వమే కాదు, ప్రజలు కూడా భావిస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాలకు ఇచ్చినట్టే తమకూ మెడికల్ కాలేజీలు, నవోదయ, కస్తూర్బా పాఠశాలలు ఇవ్వాలని కేంద్రాన్ని కృష్ణయ్య డిమాండ్ చేశారు. అమ్మ ఒడి వంటి పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టుకు తగినన్ని నిధులు కేటాయించి వెంటనే పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామని కృష్ణయ్య వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement