Thursday, May 2, 2024

Notice – పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు – వారం లోగా వివరణ ఇవ్వకుంటే అనర్హత వేటు…

అమరావతి – గతంలో ఓ పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎట్టకేలకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చర్యలు చేపట్టారు. తమ పార్టీ తరఫున గెలిచి ప్రత్యర్ధి పార్టీలోకి ఫిరాయించారంటూ టీడీపీ, వైసీపీ తమ పార్టీకి చెందిన నలుగురేసి ఎమ్మెల్యేలపై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.వీరితో పాటు జనసేన కూడా తమ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యేపై ఇలాంటి ఫిర్యాదే చేసింది. వీరిపై అనర్హత వేటు వేయాలని ఆయా పార్టీలు కోరాయి..

దీనిపై ఎన్నికల వేళ స్పందించిన స్పీకర్ తమ్మినేని సీతారాం.. చర్యలు ప్రారంభించారు. టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిధర్ తో పాటు వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వెళ్లిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, జనసేన తరఫు గెలిచి వైసీపీలోకి వెళ్లిన రాపాక వరప్రసాద్ కు స్పీకర్ ఇవాళ వివరణ ఇవ్వాలని నోటీసులు పంపారు.

తమ పార్టీలు ఇచ్చిన అనర్హత వేటు ఫిర్యాదులపై వారంలోగా సంతృప్తికర సమాధానం ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారం వీరికి పంపిన నోటీసుల్లో పేర్కొన్నారు . లేదంటే అనర్హత వేటు తప్పదని హెచ్చరించారు. ఈ నోటీసులపై స్పందించేందుకు నెల రోజుల సమయం కావాలని పలువురు ఎమ్మెల్యేలు కోరినా వారం రోజుల సమయం మాత్రమే ఇచ్చారు. దీంతో వారం లోగా ఈ 9 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిసి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement