Tuesday, May 21, 2024

తెలుగు త‌మ్ముళ్ల‌లో పొత్తుల టెన్ష‌న్ …

అమరావతి, ఆంధ్రప్రభ: జనసేనాని పవన్ కల్యాణ్‌ పొత్తులపై చేసిన ప్రకటన టీడీపీ నేతలను కలవరానికి గురిచేస్తున్నది. పొత్తుల అంశంపై విస్పష్టమైన అభిప్రాయానికి పవన్‌ కళ్యాణ్‌ రావడంతో టీడీపీ నేతల్లో ఇప్పుడు సీట్‌ టెన్షన్‌ మొదలైంది. జనసేన ఎక్కడెక్కడ టిక్కెట్లు ఆశిస్తుందో తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందో తెలియని పరిస్థితుల్లో నేతలు ఉన్నారు. అయితే, ఈ ప్రకటన తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మాత్రం హుషారును పెంచింది. జనసేనతో కలిసి ఎన్నికల బరిలోకి దిగితే అధికారం ఖాయమన్న ధీమాలో పార్టీ శ్రేణులు ఉన్నారు. ఇదే సమయంలో టీడీపీ అధిష్టానం కూడా జనసేనాని చేసిన ప్రకటనపై సంతోషంగా ఉంది. షరతులు లేకుండా పొత్తులకు వెళ్తామని అయితే, ఎవరికి లొంగేది లేదని పవన్‌ స్పష్టంచేయడం టీడీపీ అధిష్టానాన్ని సంతృప్తి పరిచింది. ఇంకోవైపు బీజేపీతో కలిసి నడిచే అవకాశాలను కూడా మార్గం సుగుమం అయ్యే పరిస్థితి ఉండటంతో మరింత బలంగా ముందుకు వెళ్లాలన్న భావనలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో సీట్ల పంపకాలే మిగిలాయన్న అభిప్రాయంలో టీడీపీ ముఖ్య నేతలు ఉన్నారు. దాదాపు 35 నుండి 40 అసెంబ్లి స్థానాలతోపాటు ఏడు పార్లమెంటు స్థానాలను జనసేన ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది.

ఇదే సమయంలో బీజేపీ కూడా ఈ పొత్తులో భాగమైతే ఆపార్టీకి కొన్ని స్థానాలను కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. ఈప్రభావం ఇప్పటివరకూ క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గంలో పట్టు పెంచుకుంటున్న టీడీపీ నేతలపై పడనుంది. జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాలపై టీడీపీ అధిష్టానం ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినట్లుగా విశ్వసనీయ సమాచారం. పార్టీ అంతర్గత సర్వేతోపాటు థర్డ్‌ పార్టీ సర్వేల ద్వారా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని ఇప్పటికే టీడీపీ అధిష్టానం క్షుణ్ణంగా తెలుసుకుంది. ఈపరిస్థితుల్లో జనసేన ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో ఆపార్టీ అభ్యర్దులకే టిక్కెట్లు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. ఈ పొత్తుల ప్రభావం అధికంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కొంత మేర రాయలసీమలో చూపనుంది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో అధిక సీట్లను జనసేన ఆశిస్తుంది. దీనికి సంబంధించి టీడీపీ, జనసేన అధినేతలు త్వరలోనే మరోసారి భేటీ కానున్నారు. ఇప్పటికే మూడు సార్లు భేటీలు నిర్వహించి పొత్తులపై ఒక నిర్ధిష్టమైన అభిప్రాయానికి వచ్చిన ఇరు పార్టీల అధినేతలు శనివారం కర్నాటక ఫలితాలు వెలువడిన అనంతరం మరోసారి భేటీకి సన్నాహాలు చేస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లోనే పవన్‌, చంద్రబాబులు బేటీ అయ్యే అవకాశాలున్నట్లుగా తెలుస్తుంది. ఈభేటీలో పొత్తులపై దాదాపు క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా టీడీపీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. పొత్తులపై నిర్ణయం తీసుకున్న అనంతరం మహా నాడు వేదికగా కార్యకర్తలకు టీడీపీ అధిష్టానం పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వనుంది. ఈనేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా నియోజకవర్గాల పరిస్థితులను పూర్తిస్థాయిలో సమీకరించి జనసేనకు కేటాయించాల్సిన స్థానాలపై ఒక నిర్ధిష్టమైన నిర్ణయానికి టీడీపీ రానన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement