Sunday, April 28, 2024

పనులు లేవు .. పైసలూ లేవు.. అధికారం అంత కన్నా లేదు..

ఉదయగిరి, (ప్రభన్యూస్‌) : వైసీపీ ఆవిర్భావం నుంచి కష్టపడ్డాం. పార్టీ విజయానికి ఎంతగానో కృషి చేశాం. అనుకున్నట్టే భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చాం. మాకు ఇక తిరుగుండదు.. ఎంతో కొంత అభివృద్ధి చేసి చూపించే అవకాశమూ ఉంటుంది. ఇలా అధికార పార్టీ చోటా నేతల నుంచి నియోజకవర్గ ప్రజాప్రతినిధుల వరకూ లెక్కలేసుకున్నారు. ఏడాది గడిచింది. రెండున్నరేళ్లు గడిచాయి. కానీ వారి ఆశలు నెరవేరలేదు. ఇప్పుడు ముచ్చటగా మూడో ఏడాదిలో అడుగెట్టినా ఎటువంటి ఫలితం ఉండడం లేదు. పదవుల్లో ఉన్న వారితో పాటు- పదవులు లేని వారిదీ అదే నిర్వేదం. పదవులు చేపడుతున్న వారు అటు నిధులు రాక ఇటు చేతి ఖర్చులు పెరిగి విసిగి వేశారిపోతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నయమని వ్యాఖ్యానిస్తున్నారు. అప్పట్లో ‘నీరు-చెట్టు’ ఉపాధి హామీ తదితర పనులు చేపట్టారు. ఉపాధి హామీ పనులను గ్రామ పంచాయతీల పరిధిలో చేపట్టే విధంగా వెసులుబాటు కల్పించారు. దీనివల్ల సర్పంచ్‌లకు కొంతవరకూ ఏదో ఒక అభివృద్ధి చేశామన్న సంతృప్తి ఉండేది. ప్రస్తుతం ఉపాధి పనులు కూడా చేసే పరిస్థితి లేకపోవడంతో సర్పంచ్‌లు ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉంటున్నారు.

ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులదీ అదే దారి. ఎంతో ఖర్చుపెట్టి పదవులు దక్కించుకుంటే ఇదేమి పరిస్థితి అంటూ వారు నిట్టూరుస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు నిధులన్నవే లేనప్పుడు ఈ పదవులు ఎందుకంటూ వారు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు రాకపోవడంతో చాలామంది నాయకులు పార్టీ మారారు. ఏళ్లు గడుస్తున్నా బిల్లులు చెల్లించకపోవడంతో వారంతా అసంతృప్తితో ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement