Friday, May 17, 2024

ఉపాధి కన్వర్జెన్స్‌ పనుల్లో నెగ్లిజెన్స్‌.. వెనుకప‌డ్డ జిల్లాలు మ‌రింత వెనక్కి..

విజయనగరం, ప్రభన్యూస్ : దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించని.. వ్యవహారం జిల్లాలో పునరావృతం కానుందా? అంటే పరిస్థితులు అవుననే చెబుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే కోట్లాది రూపాయిల నిధులు వెనక్కి మళ్లిపోయే సాంప్రదాయాన్ని కొనసాగించేందుకే అధికార యంత్రాంగం మొగ్గు చూపుతోందా? అన్న సందేహాలు సర్వత్రా కలుగుతున్నాయి కూడా. ముఖ్యంగా కోట్లాది రూపాయిల ఉపాధి కన్వర్జెన్సీ నిధులు వెచ్చించడంలో మన అధికారులు విఫలమవుతూ వచ్చి వెనుకబాటు జిల్లాను మరింత వెనక్కి నెట్టేస్తున్న పరిస్థితి స్పష్టంగా తెలుస్తోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కాదు వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా అధికారుల అచేతనత్వం..నిర్లక్ష్యం..కారణంగా కోట్లాది రూపాయిల నిధులు వెనక్కి మళ్లిపోయిన దుస్థితి. తాజాగా 2019, 2020 సంవత్సరాల్లో నెలకొన్న పరిస్థితులనే అధ్యయనం చేస్తే జిల్లాలొ కన్వర్జెన్సీ పనులు చేపట్టలేక, చేపట్టినా ముగించలేక 2019లో ఏకంగా రూ.311 కోట్లు వెనక్కి మళ్లిపోయాయి. అయినా ఏమాత్రం సీరియస్‌గా పరిగణించని మన జిల్లా అధికార యంత్రాంగం 2020లో కూడా దాదాపుగా అదే అలసత్వాన్ని ప్రదర్శించింది. ఫలితంగా రూ.211 కోట్ల నిధులు వెనక్కి మళ్లిపోయాయి.

ఈ ఏడాది కూడా మన అధికారులు అదే బాటలో పయనిస్తారేమో అన్నట్లున్నాయి క్షేత్ర స్థాయిలో పరిస్థితులు. ఎందుకంటే ఉపాధి కన్వర్జెన్సీ నిధులు ఈ ఏడాది కూడా రూ.440 కోట్ల వరకు అందుబాటులో వున్నా అవి సక్రమంగా సకాలంలో వెచ్చించే పరిస్థితి వుంటుందా? లేదా? అన్నదే సందేహంగా మారింది. సచివాలయాలు(664), రైతు భరోసా కేంద్రాలు(ఆర్‌బీకే)618,వెల్‌నెస్‌ కేంద్రాలు 495, బల్కుమిల్కు కేంద్రాలు220,డిజిటల్‌ గ్రంధాలయాలు195.. వెరసి మొత్తంగా 2192 భవన నిర్మాణాల పనులు మంజూరు కాగా ఇంత వరకు పూర్తయినవి కేవలం 338 మాత్రమే. 12 సచివాలయాలు, 38 రైతు భరోసా కేంద్రాలు, 59 వెల్‌నెస్‌ కేంద్రాలకు సంబంధించిన భవన నిర్మాణాలు ఇప్పటికీ మొదలు కాని పరిస్థితి. బల్కుమిల్కు కేంద్రాలు, డిజిటల్‌ గ్రంధాలయాలు అయితే ఒక్కటీ ప్రారంభం కాని పరిస్తితి. ఇంతవకు మొత్తంగా వెచ్చించింది కేవలం రూ.185 కోట్లు మాత్రమే. ఈనేపథ్యం గమనిస్తే మరోమారు రూ.కోట్లలో నిధులు వెనక్కిపోవచ్చన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. అమాత్యుల సమీక్షలు, అధికారుల సమీక్షలు..వెరసి ఇస్తున్న ఫలితాలేంటన్నది రూ.కోట్లాది నిధులు వెనక్కి మళ్లిపోయే ఉదంతాలు చెప్పకనే చెబుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement