Friday, May 3, 2024

ఎమ్మెల్సీ ఎన్నిక‌లు – ఆ అయిందింటి పైనే ఫోక‌స్

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార, విపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా యి. ప్రత్యేకించి ఐదు నియోజక వర్గాలపై ప్రధాన పక్షాలు ప్రత్యేక ఫోకస్‌ పెట్టాయి. మరో ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎన్నికల ఏడాది కావడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రాధాన్యత సంతరిం చుకున్నాయి. వైసీపీ ప్రభుత్వంపై తరుచూ విమర్శలు చేస్తున్న విపక్ష పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ద్వారా ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నట్లు తాము చెప్పింది నిజమేనని రుజువు చేయాలని విశ్వప్రయత్నం చేస్తున్నాయి. ఐదింటిని గెలుచుకొని విపక్ష పార్టీలు చెప్పే వ్యతిరే కత లేదని చెప్పేందుకు అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజక వర్గాల్లో గెలుపు బాధ్యతలను ఎమ్మెల్యేలు, మంత్రు లకు అధికార పార్టీ అప్పగిస్తే. విపక్ష పార్టీలు కీలక నేతలకు ఆ బాధ్యతలను అప్పగించాయి. రాష్ట్రంలో ఈ నెల 13న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. 16న కౌంటింగ్‌ జరపనున్నట్లు ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే ప్రకటించింది. స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే, గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు అధికార పార్టీకి నల్లేరుమీద నడక లాంటిదే. స్పష్టమైన మెజారిటీ ఉండటంతో ఇక్కడ అభ్యర్థుల గెలుపుకు ఢోకా లేదు.

ఎటొచ్చి పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లోనే గట్టి పోటీ నెలకొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు(తూర్పు రాయలసీమ), కడప, అనంతపురం, కర్నూలు(పశ్చిమ రాయలసీమ) పట్టభద్రుల నియోజకవర్గాలతో పాటు తూర్పు, పశ్చిమ రాయలసీమ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. మూడు గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గాల్లో తొమ్మిది లక్షల వరకు ఓటర్లు ఉండగా, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో 43వేల ఓట్లు ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం. మూడు పట్ట భద్రుల నియోజకవర్గాల్లో అధికార వైసీపీ, తెదేపా, బీజేపీ అభ్యర్థులను పోటీలో పెట్టగా..ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికల్లో వైసీపీ, పీడీఎఫ్‌ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇప్పుడు వీరి గెలుపు కోసం కీలక నేతలు రంగంలోకి దిగి మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్నారు.

అభ్యర్థులు వీరే..
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ బ్రాహ్మణ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ను రంగంలోకి దించగా తెదేపా నుంచి వీ.చిరంజీవీరావు, బీజేపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ బరిలో ఉన్నారు. తూర్పు రాయలసీమలో అధికార వైసీపీ నుంచి పీ.శ్యాంప్రసాద రెడ్డి బరిలో ఉండగా తెదేపా నుంచి కే.శ్రీకాంత్‌ చౌదరి, బీజేపీ నుంచి ఎస్‌.దయాకర్‌ రెడ్డి, పశ్చిమ రాయలసీమలో వైసీపీ నుంచి వెన్నపూస రవి, తెదేపా నుంచి భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి, బీజేపీ నుంచి నగరూరు రాఘవేంద్ర బరిలో ఉన్నారు. తూర్పు, పశ్చిమ ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి వైసీపీ తరుపున పీ.చంద్రశేఖర రెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి బరిలో ఉండగా పీడీఎఫ్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, పీ.బాబురెడ్డి, ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి, జీవీ నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు ఉన్నప్పటికీ పోటీ ప్రధాన పార్టీల మధ్య ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో అధికార వైసీపీ, పీడీఎఫ్‌ అభ్యర్థుల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది.

ఆరోపణలు నిజం చేసేందుకు..
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి, అక్రమాలు పెరిగాయనేది తరుచూ ప్రతిపక్ష తెదేపాతో పాటు బీజేపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు చేస్తున్న ఆరోపణలు. ధరల పెరుగుదల, ఇసుక, మద్యం పాలసీ వంటి పలు అంశాలు ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచినట్లు విపక్షాల ఆరోపణ. మరో వైపు యువతకు ఉపాధి అవకాశాల కల్పన, జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయకపోవడం వంటి పలు అంశాలను గ్రాడ్యుయేట్లలో అసంతృప్తికి దారితీసిందని వీరు భావిస్తున్నారు. ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వ వైఖరి తమకు కలిసొస్తుందనేది విపక్ష పార్టీల భావన. ఈ ఐదు నియోజకవర్గాల్లో అధికార పార్టీకి చెక్‌ పెట్టడం ద్వారా ఇప్పటి వరకు తాము చేసిన ఆరోపణలు ప్రజలు విశ్వసించినట్లు చెప్పడంతో పాటు రానున్న సార్వత్రిక ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవాలని ప్రధాన పార్టీలు గట్టి పట్టుదలతో ఉన్నాయి.

- Advertisement -

ఫీల్‌గుడ్‌తో ఎన్నికలకు..
మరో ఏడాదిలో జరిగే ఎన్నికలకు ఫీల్‌గుడ్‌తో వెళ్లాలనేది అధికార పార్టీ వ్యూహంగా ఉంది. ఐదు ఎమ్మెల్సీ స్థానాలు చేజిక్కించుకోవడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత విపక్ష పార్టీల సృష్టేనని చెప్పేందుకు వైసీపీ సిద్ధమైంది. ఏ ఒక్క స్థానం చేజారకుండా ఇప్పటికే సీఎం వైఎస్‌ జగన్మోహన రెడ్డి పార్టీ నేతలకు స్పష్టమైన దిశా నిర్థేశం చేశారు. అందులో భాగంగా మంత్రులు, కీలక నేతలతో పాటు ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. మరో ఏడాదిలో జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపుపై సీట్ల ఖరారు ఆధారపడి ఉంటుందనే భావనతో ఎమ్మెల్యేలు సైతం అభ్యర్థుల గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందివచ్చిన ఏ ఒక్క అవకాశం జారవిడుచుకోకుండా అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా వెళుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార వైసీపీ, విపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ ఐదు నియోజకవర్గాల ఓటర్ల మనోగతం మరో పన్నెండు రోజుల్లో తేలనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement