Monday, May 6, 2024

Open Letter : పవన్ కు ముద్రగడ హితవు.. భాష మార్చుకోవాలంటూ సూచన

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం కాకినాడలో పర్యటిస్తున్న జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు. అందులో.. కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేసి, కొందరు రాజకీయంగా ఎదుగుతున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలకు ముద్రగడ ఘాటు రిప్లై ఇచ్చారు. నిజాన్ని నిర్భయంగా చెప్పాలన్న ఉద్దేశంతోనే తాను ఈ లేఖ రాస్తున్నానన్న ఆయన.. తాను కులాన్ని వాడుకుని రాజకీయంగా ఎదగలేదని, యువతను వాడుకుని పబ్బం గడుపుకోలేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయి ఉద్యమమూ చేయలేదని చురకలంటించారు. తాను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి, యువతకు రిజర్వేషన్ ఫలాలు మీరెందుకు అందించలేదు ? అని ప్రశ్నించారు. కాపు ఉద్యమంతో తాను ఓటమికి దగ్గరయ్యానన్నారు.

వీధి రౌడీ భాషలో మాట్లాడడం ఎంతవరకు న్యాయమన్న ముద్రగడ.. మీరు మాట్లాడే భాష వల్ల నష్టం వాటిల్లుతుంది తప్ప లాభం లేదని తేల్చి చెప్పారు. ఇప్పటివరకు ఎంత మందిని చెప్పుతో కొట్టారో, గుండ్లు గీయించారో సెలివ్వాలని డిమాండ్ చేశారు. ద్వారంపూడి కుటుంబం తప్పుడు మార్గాల్లో సంపాదిస్తుందని మాట్లాడడం తప్పని సూచించారు. కాపుల ఉద్యమానికి సహాయం చేసిన వారిని విమర్శించడం తప్పు అని హితవు పలికారు. కాపు ఉద్యమానికి మీరెందుకు రాలేదని పవన్‌ని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడిపై పోటీ చేసి, ఆయన్ను ఓడించాలని.. మీ సత్తా చూపించడానికి ముందుకు రావాలని ఛాలెంజ్ చేశారు. 175 స్థానాల్లో పోటీ చేసినప్పుడు ముఖ్యమంత్రిని చేయండని అడగాలని.. కలిసి పోటీ చేస్తున్నప్పుడు సీఎంని చేయమని అడగడం హాస్యాస్పదం అని దుయ్యబట్టారు. రిజర్వేషన్ అంశం కేంద్రం పరిధిలోనిదని వైఎస్ జగన్ చెప్పినప్పుడు.. తానిచ్చిన సమాధానమేంటో అడిగి తెలుసుకోవాలని చెప్పారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని మీరు తరచూ అంటున్నారని… అలాంటప్పుడు నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని మీరు ఎలా అడుగుతున్నారో తనకు అర్థం కావడం లేదని ముద్రగడ అన్నారు. 175 స్థానాల్లో పోటీ చేసినప్పుడే నన్ను సీఎం చేయండి అనే పదం వాడాలే తప్ప… కలిసి పోటీ చేసేటప్పుడు మీరే సీఎం అనుకోవడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement