Monday, April 29, 2024

ఏపీలో ఆర్థిక సంక్షోభం: రాష్ట్రపతికి రఘురామ లేఖ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందంటూ రాష్ట్రపతి రామనాథ్ కొవింద్‌కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ కూడా క్లారిఫికేషన్ అడిగారన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 142 శాతం బడ్జెట్ అంచనాలను మించి ప్రభుత్వం అప్పులు చేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు చూస్తుంటే పరిస్థితి అత్యంత భయంకరంగా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కూలుతుందోననే భయం వేస్తోందని రఘురామ అన్నారు. బడ్జెట్ అంచనాలకు మించి రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు ఉన్నాయని వివరించారు. సమీప భవిష్యత్తులో ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోనుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రం చేస్తున్న అప్పుల్లో 42 శాతం పాత అప్పులపై వడ్డీ చెల్లిచడానికే సరిపోతుందన్నారు. జులై రెండో వారం వరకు కూడా ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌లు చెల్లించలేదని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితి చరిత్రలో ఇంతకుముందు ఎన్నడూ లేదన్నారు. తక్షణం ఏపీలో కేంద్రం ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించాలని లేఖలో రాష్ట్రపతిని ఎంపీ రఘురామ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement