Friday, May 17, 2024

కదలరు… వదలరు.. వైద్య ఆరోగ్యశాఖ బదిలీల్లో పైరవీలు..

కర్నూలు, ప్రభన్యూస్‌ : వైద్య ఆరోగ్యశాఖలో బదిలీల ప్రక్రియ ప్రహసనంగా కొనసాగుతున్నది. ఏళ్ల తరబడి ఆయా పోస్టుల్లో పాతుకు పోయిన పలువురు ఇక్కడే కొనసాగేందుకు పైరవీలు ప్రారంభించారు. ఇటీవల ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన ఉద్యోగులను బదిలీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అధికారులు బదిలీల కోసం ఆన్‌లైన్‌ ద్వారా ఆప్షన్‌ తీసుకుంటున్నారు. అయితే దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తూ అక్కడి నుంచి బదిలీపై వెళ్లేందుకు ఇష్టపడని కొందరు రకరకాల ప్లాన్స్ వేసుకుంటుంన్నారు. ఈసారి బదిలీల కోసం ఉద్యోగులు రాజకీయ పార్టీ నేతలు, ఉద్యోగ సంఘాల చుట్టూ ప్రదర్శనలు చేస్తూ సిఫారస్సుకు తెరలేపారు. దీంతో అర్హులైన ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు 1,500 మంది వరకు, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 80 శాతం, మెడికల్‌ కళాశాలలో 70 శాతం బదిలీలు జరగాల్సి ఉంది. బదిలీల వ్యవహారంలో ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఉద్యోగ సంఘాలకు కొంత మినహాయింపు ఉంది. ఆ మినహాయింపును ఆధారం చేసుకొని కొందరు ఉద్యోగులు రాజకీయ పార్టీల నేతల ద్వారా ఉద్యోగ సంఘం నాయకులపై ఒత్తిళ్లు పెంచారు. విషయం తెలుసుకున్న కొందరు ఉద్యోగులు ఈ విషయంపై ప్రశ్నించే .. వీటిని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. దీంతో సంఘ బాధ్యులు ఇరకాటంలో పడ్డారు. బదిలీల ప్రక్రియ సాగిన ప్రతిసారి కొందరు ఉద్యోగులు యూనియన్‌ లెటర్‌లను, స్పాజ్‌ వంకతో బదిలీలను తప్పించుకుంటున్నారు. ఇలా ఒక్క జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిదిలోనే దాదాపు 5 నుంచి 20 ఏళ్లకు పైగా ఒకేచోట పాతుకుపోయిన వారు ఉన్నారు. ఇలాంటి వారు కూడ ప్రస్తుత బదిలీల్లో ఏదో ఒక వంకతో బదిలీ కాకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు.

ఉద్యోగుల వివరాలను నమోదులో జాప్యం..

వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో బదిలీ ప్రక్రియలో భాగంగా ఉద్యోగుల నమోదు విషయంలో జాప్యం చోటు చేసుకుంటున్నది. వాస్తవంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 7వ తేదిలోగా ఒకేచోట ఐదేళ్లకు పైగా పనిచేస్తున్న ఉద్యోగుల జాబితాను ఈనెల 7వవ తేదిలోగా ప్రకటించాల్సి ఉంది. అయితే 10వ తేదికి కూడా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆన్‌లైన్‌నమోదు, ఆఫ్‌లోడ్‌ ప్రక్రియను పూర్తిచేయలేక పోయారు. ఈ క్రమంలో ప్రతి ఫిర్యాదును స్వీకరిస్తూ మరి ఆన్‌లైన్‌లో అప్‌లోడింగ్‌ చేస్తున్నారు. శనివారం లేదా సోమవారం నాటికి ఉద్యోగులు వారికి కావాల్సిన స్థానాలు ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకునే అవకాశం ఉండొచ్చు. ఆన్‌లైన్‌లో తప్పిదాలు లేకుండా బదిలీల ప్రకియ పూర్తి చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గిడ్డయ్య వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement