Monday, April 29, 2024

Mangalagiri – తాగుబోతుల అడ్డా @ పార్క్ రోడ్ – చోద్యం చూస్తున్న పోలీసులు

మంగళగిరి క్రైమ్ సెప్టెంబరు 24(ప్రభ న్యూస్) – నవ్యనగరం మంగళగిరి లో మందుబాబుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నగరంలోని పార్క్ రోడ్ తాగుబోతుల అడ్డాగా మారిపోయింది. మందుబాబులు విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ బహిరంగ మద్యపానం చేస్తూ తమను ఎవరూ ఏమి చేయలేరు అన్న ధీమాతో విర్రవీగిపోతున్నారు. ముఖ్యంగా పార్క్ రోడ్ ప్రధాన మార్గం వెంబడి ఉన్న నగరపాలక సంస్థ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద పగలు-రాత్రి అనే తేడా లేకుండా ఎక్కడ ఎక్కడి నుంచో వచ్చే మందుబాబులు వాలిపోతుంటారు. గౌతమ బుద్దా రోడ్డు పై ఆటోలు పార్కింగ్ చేసి ఉండటంతో వాటి చాటు ఉండడం మందుబాబులకు అనువుగా మారిపోయాయి. ఇక్కడ మందుకొడితే ఎవరూరారులే అన్న ధీమాతో జల్సా చేసుకుంటున్నారు. తాగిన వారు ఊరికే పోతారా అంటే అది లేదు.. తాగిన సీసాలను అక్కడే పగులకొట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఫలితంగా స్థానిక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గాజు పెంకులు ఉండడంతో నిత్యం ఏదో ఒక పనిపై కార్పోరేషన్ కార్యాలయానికి అటుగా వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ తాగకూడదని చెబితే దాడికి సైతం దిగుతున్నారని స్థానికులు వాపోతున్నారు. కొందరు స్థానికులు చేసేదేమి లేక బిక్కుబిక్కుమంటూ సాయంత్రం ఆరు గంటలకే తలుపులేసుకుని ఇంట్లోనే ఉండే పరిస్థితులు నెలకొన్నాయి.

నగరంలోని కొత్త బస్టాండ్ సెంటర్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు మందుబాబులకు అతి ముఖ్యమైన అడ్డాలుగా మారిపోయాయి. చిన్న వయస్సులోనే యువకులు మద్యానికి అలవాటు పడి తమ తల్లిదండ్రులకు, తెలిసిన వారికి కంట పడకుండా ఉండేందుకు ఈ అడ్డాలను ఎంచుకుంటున్నారు. మద్యపానంతో పాటు ధూమపానం, గంజాయిని సైతం సేవిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇక తాగిన మైకంలో మాటామాటా పెరిగి చిన్నచిన్న కారణాలతోనే కొట్టుకున్న ఘటనలు అనేకం లేకపోలేదు.

ఏదేమైనా పోలీసులు నిత్యం పట్టణంలోని నిర్మానుష్య ప్రదేశాలను గమనిస్తూ పెట్రోలింగ్‌ చేస్తే ఫలితం ఉంటుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 6గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మద్యం బాబుల అడ్డాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తే ఫలితం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నగరంలోని వైన్‌షాపుల పరిసర ప్రాంతాల్లో, చికెన్‌ఫ్రై సెంటర్ల పేరుతో ఏర్పాటు చేసుకున్న దుకాణాల వద్ద సైతం బహిరంగ మద్యపానం నిర్వహించడం కొసమెరుపు. నగర నడిబొడ్డున ఇంత బహిరంగంగా మద్యపానం జరుగుతున్నా పోలీసులు అంతగా పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏదేమైనా పోలీసులు బహిరంగ మద్యపానం సేవిస్తున్న మందుబాబులపై కొరడా ఝుళిపించాలని పలువురు నగర ప్రజలు కోరుతున్నారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు….పట్టణ సీఐ మల్లికార్జునరావు,

- Advertisement -

నగరంలో బహిరంగ మద్యపానం నిషేధం. దాన్ని అతిక్రమించి ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వైన్స్‌లో, బార్లలో తప్ప బయట ఎక్కడ బహిరంగంగా మద్యపానం సేవించరాదు. బహిరంగ మద్యపానం నిర్వహిస్తున్న ప్రదేశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. అని హెచ్చ‌రించారు ప‌ట్ట‌ణ సిఐ మ‌ల్లిఖార్జున‌రావు.

Advertisement

తాజా వార్తలు

Advertisement