Wednesday, February 28, 2024

మహానీయుల త్యాగాలే స్ఫూర్తి

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆనాటి మహ నీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్‌, జి ల్లా ప్రధాన న్యాయమూర్తి పి. వెంకటజ్యోతిర్మయి అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల ప్రకారం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఆజాద్‌ క అమృత మహోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న న్యాయ విజ్ఞాన సదస్సుల ముగింపు కార్యక్రమంలో న్యాయమూర్తి పాల్గొని ప్రసంగించారు. అంద‌రికీ చిల్డ్రన్స్‌ డే శుభాకాంక్షలు తెలియ‌జేశారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ అక్టోబర్ 2 నుంచి ఆదివారం వరకు జిల్లా వ్యాప్తంగా 56 మండలాల్లోని దాదాపు 1100 గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు, చట్టాలపై అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలకు చట్టాలు న్యాయవ్యవస్థ పట్ల అవగాహన కలిగించే విధంగా నిర్వహించామని జిల్లా వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రజలకు చట్టాల పట్ల అవగాహన కల‌గ‌ చేశామని అన్నారు. కొత్తపట్నంలో గిరిజనులకు, ఒంగోలులో అసంఘటిత రంగంలో కార్మికులకు న్యాయ సేవల శిబిరాలు నిర్వహించి ప్రజల యొక్క న్యాయపరమైన సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించి సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపించి సమస్యల పరిష్కారానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కృషి చేస్తుందని అన్నారు.

ఈ బృహత్‌ కార్యక్రమంలో పోలీస్‌ రెవెన్యూ శాఖల‌ వారు, అనేక ప్రభుత్వ శాఖల వారు సహకరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం ఈ స్థాయిలో విజయవంతం కావటానికి జిల్లా వ్యాప్తంగా న్యాయమూర్తులు న్యాయవాదులు, న్యాయ సేవ సహాయకులు ప్రతి ఒక్కరూ తమ తమ పరిధిలో తోడ్పాటు అందించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి చెన్నంశెట్టి రాజు మాట్లాడుతూ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సూచనల మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. వీటిని సామాన్య ప్రజలు సద్వినియోగం పంచుకోవాలని అన్నారు.
జిల్లా ఎస్పీ మలిక గర్గ్‌ మాట్లాడుతూ ఆర్థిక కారణాల రీత్యా న్యాయం పొందలేని వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అండగా ఉంటుందని అర్హులైన వారికి ఉచిత న్యాయ సహాయం చేస్తుందని ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. అదే విధంగా బాల బాలికల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించి లైంగిక దాడులకు గురి కాకుండా చూడాలని చెబుతూ వారికి సంబంధించిన లైంగిక దోపిడీ చట్టం గురించి తెలియజేశారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి. శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సు ద్వారా రైతులకు బాల బాలికలకు సాధారణ అవగాహన కలిగి చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తిలు, సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఒంగోలు బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ బొడ్డు భాస్కరరావు, పలువురు న్యాయవాదులు, న్యాయ సేవ సహాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, పతకాలు, న్యాయసేవసహాయకులకు ప్రశంసపత్రాలు అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement