Monday, April 29, 2024

Lok Sabha Siren – ఏపీ, తెలంగాణల్లో వ్యూహాల‌కు తెర‌లేపిన పార్టీలు …

అనధికారికంగా లోక్ సభ ఎన్నికల సైరన్ మోగింది. ఏపీ, తెలంగాణల్లో అన్ని రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. ఇక ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే సై అంటున్నాయి. అప్పడే జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయ కర్తల బాధ్యతలను తమ నాయకులకు అప్పగించాయి. ఇక తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ, టీడీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికలో కసరత్తులు పారంభించాయి. తెలంగాణలో ఎట్టి పరిస్థితిలో బలాన్ని పెంచుకోవాలని కాంగ్రెస్, బీజేపీ తలమునకల్లో తేలుతున్నాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ నియోకవర్గాల్లో పార్టీ బలోపేత బాధ్యతలను మంత్రులకు అప్పగించింది. 17 నియోజకవర్గాల్లోనూ విజయం సాధించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్.. తదితరులకు పార్లమెంట్ స్థానాల బాధ్యతలను అప్పగించారు. ఇక పోటీ చేసే అభ్యర్థుల ఎంపికే ఆలస్యం.

వ్యూహాత్మక ఎత్తుగడల్లో బీఆర్ఎస్
ఇటీవల ఎన్నికల్లో అధికారాన్ని చేజార్చుకున్న బీఆర్ఎస్ ఇక లోక్: సభ ఎన్నికల్లో కదం తొక్కటానికి సన్నద్ధమవుతోంది. అనారోగ్యంతో విశ్రాంతి తీసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫిబ్రవరిలో ప్రజల ముందుకు వస్తారు. ఈ లోపు పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్రావు, కవిత.. తదితరులు పార్టీ నేతలతో సమీక్షలు జరుపుతున్నారు. నిజమాబాద్ ఎంపీ స్థానంలో ఎవరు పోటీ చేయాలనే అంశంపై సోమవారం సమీక్ష జరిపారు. కొత్త అభ్యర్థిని రంగంలోకి దించితే ఎలా ఉంటుందనే అశంపై చర్చ జరిగింది. పార్టీ నేతలు మాత్రం కవితను రంగంలోకి దించాలని అభ్యర్థించారు. ఇలా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ కూలంకషంగా చర్చిస్తోంది.

బీజేపీ కసరత్తు..
తెలంగాణలో ఓటు బ్యాంకును పెంచుకున్న బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో మరింత బలాన్ని పెంచుకోవాలని వ్యూహ రచన చేసింది. అంతర్గత కుమ్ములాటలను పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పని చేయాలని బీజేపీ అగ్రనేత అమిత్ షా పిలుపు మేరకు బీజేపీలో మార్పులు వచ్చాయి. తాజాగా నియోజకవర్గాల ఇన్ చార్జ్లను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఆదిలాబాద్ : పాయల్ శంకర్ (ఎమ్మెల్యే), పెద్దపల్లి : రామారావు పవార్ (ఎమ్మెల్యే), కరీంనగర్ : ధన్పాల్ స్యూర్య నారాయణ గుప్త (ఎమ్మెల్యే), నిజామాబాద్ : ఆలేటి మహేశ్వర్ రెడ్డి (ఎమ్మెల్యే), జహీరాబాద్ : వెంకట రమణ రెడ్డి (ఎమ్మెల్యే), మెదక్ : పాల్వాయి హరీష్ బాబు (ఎమ్మెల్యే), మల్కజ్ గిరి : పైడి రాకేష్ రెడ్డి, (ఎమ్మెల్యే), సికింద్రాబాద్ : కె.లక్ష్మణ్ (ఎంపీ), హైదరాబాద్ : టి.రాజా సింగ్ (ఎమెల్యే), చేవెళ్ల : వెంకట నారాయణ రెడ్డి (ఎమ్మెల్యే), మహబూబ్ నగర్ : ఎన్.రామచందర్ రెడ్డి (మాజీ ఎమ్మెల్సీ), నాగర్ కర్నూల్ : మారం రంగారెడ్డి (మాజీ ఎమ్మెల్సీ), నల్గొండ : చింతల రామచంద్ర రెడ్డి (మాజీ ఎమ్మెల్యే), భువనగిరి : ఎన్ ఎస్ ఎస్ ప్రభాకరరావు ( మాజీ ఎమ్మెల్సీ ), వరంగల్ : మర్రి శశిధర్ రెడ్డి ( మాజీ మంత్రి ), మహబూబా బాద్ : గరిక పాటి మోహన్ రావు (మాజీ ఎంపీ), ఖమ్మం : పొంగలేటి సుధాకర్ రెడ్డి (మాజీ ఎమ్మెల్సీ) నియమించించింది. వీరందరూ తమ పార్లమెంటు నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతమే కాదు, అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని బీజేపీ ఆదేశించింది.

అభ్యర్థుల వేటలో పార్టీలు
లోక్ సభ ఎన్నికలకు అధికార వైసీపీ, ఉమ్మడి ప్రతిపక్షం టీడీపీ, జనసేన కసరత్తులు ప్రారంభించాయి. అనేక మంది సిట్టింగ్ ఎంపీలను వైసీపీ పక్కన పెడుతోంది. కొందరు ఎంపీలను ఎమ్మెల్యే బరిలోకి దించుతోంది. విశాఖపట్నం ఎంపీని విశాఖ తూర్పు అసెంబ్లీ స్థానంలోనూ, రాజమండ్రి ఎంపీని అసెంబ్లీ స్థానంలోనూ దించగా.. ఏలూరు ఎంపీ పోటీ చేయనని ప్రకటించారు. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఏనాడో పార్టీకి దూరమయ్యారు. బందరు ఎంపీ బాలశౌరికి సీటు ఇస్తారో లేదో తేలలేదు. గుంటూరులో పోటీ చేయాలని లావు కృష్ణదేవరాయలను కోరారు. కానీ ఆయన వ్యతిరేకించారు. నర్సారావుపేటలోనే పోటీ చేస్తానని భీష్మించారు. ఇలా మార్పులు, చేర్పుల్లో వైసీపీ గుంపులు, చింపులు పడుతోంది.

టీడీపీలోనూ గలాట
జనసేన పొత్తుతో ఏపీలో అధికారంలోకి వస్తామని టీడీపీ గంపెడాశతో ఉంది. కానీ లోక్ సభ స్థానాల నిర్ణయంలో అష్టకష్టాలు పడుతోంది. ఏపీలో ముగ్గురు ఎంపీలు ఉంటే.. ఇద్దరు దూరమయ్యారు. విజయవాడ ఎంపీ కేశినేని నానిని పార్టీ పక్కన పెట్టింది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తనకు తానుగా వైదొలిగారు. ఇక జనసేనతో పొత్తు కుదిరింది. రెండు సీట్లు జనసేనకు ఇవ్వటానికి టీడీపీ అంగీకరించింది. బీజేపీతో పొత్తుపై మీమాంశ తెగలేదు. బీజేపీ ఇప్పటికే 10 ఎంపీ సీట్లు అడుగుతోంది. ఏతావాతా టీడీపీ మిత్ర పక్షం ఇంకా సీట్ల సర్దుబాటులోనే ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement