Monday, April 29, 2024

ట్రిపుల్ ఐటీ డీఎం విద్యా సంస్థలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ కోటేశ్వర రావు

కర్నూలు : జగన్నాథ గట్టుపై ఉన్న ట్రిపుల్ ఐటీ డీఎం విద్యా సంస్థకు సంబంధించిన మౌలిక వసతుల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం జగన్నాథ గట్టుపై ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మీటింగ్ హాల్ లో ఆ విద్యా సంస్థకు సంబంధించి అవసరమైన ఇతర మౌలిక వసతుల ఏర్పాటుపై కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. సమీక్షలో ఐఐఐటిడిఎం డైరెక్టర్ డివిఎల్ఎన్ సోమయాజులు, జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి, కర్నూలు నగర పాలక సంస్థ మున్సిపల్ కమీషనర్ భార్గవ్ తేజ, ఐఐఐటీడీఎం రిజిస్ట్రార్ కె.గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఐఐటిడిఎం డైరెక్టర్ డివిఎల్ఎన్ సోమయాజులు తమ విద్యా సంస్థకు అవసరమైన భూమి, కాంపౌండ్ వాల్ నిర్మాణం, నీటి సరఫరా, విద్యుత్, గార్బేజ్ కలెక్షన్ తదితర సమస్యల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఐఐఐటిడిఎంకు అదనంగా మరో 38 ఎకరాల భూమి కేటాయింపు చేసేందుకు ప్రభుత్వానికి అలియనేషన్ ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. విద్యా సంస్థ భవన సముదాయం చుట్టూ 4 కిలోమీటర్ల పొడవుతో చేపడుతున్న కాంపౌండ్ వాల్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బీ డీఈ విజయ భారతి ని కలెక్టర్ ఆదేశించారు. ఎన్ హెచ్ 44 నుంచి ఐఐఐటీడిఎం కు ప్రస్తుతం ఉన్న సింగిల్ రోడ్డు పాడైపోయిందని తద్వారా విద్యార్థులు ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, డబుల్ రోడ్ ను వేయాలని డైరెక్టర్ కోరారు. అప్రోచ్ రోడ్డు ఏర్పాటుకు నిధులు మంజూరు అయ్యాయని, ఈ అంశంపై పంచాయతీ రాజ్ ఇంజనీర్ల తో మాట్లాడి త్వరితగతిన రోడ్ నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. జగన్నాథ గట్టుపై బోర్ వెల్స్ తవ్వకం వీలు లేనందున, 2 ఎంఎల్డి సామర్థ్యంతో ఏర్పాటు చేసిన మెయిన్ సంప్ కు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా అంశంపై గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు..హై టెన్షన్ లైన్ తరలింపు కు సంబంధించి సర్వే, ఇతర అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కు సూచించారు..అప్రోచ్ రోడ్డు వెంట వీధి లైట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిపివో నాగరాజు నాయుడు ను ఆదేశించారు..విద్యా సంస్థలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాల సేకరణ కు తగిన చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ భార్గవ్ తేజ ను కలెక్టర్ ఆదేశించారు.అనంతరం ఐఐఐటీ డిఎం పరిపాలనా భవనం ఎదురుగా ఉన్న సర్కిల్ వద్ద ఉన్న రోడ్ పక్కన కలెక్టర్ , డైరెక్టర్ మొక్కలు నాటారు. సమావేశంలో కర్నూలు ఆర్డీవో హరి ప్రసాద్, ఐఐఐటీ డిఎం ఆర్కిటెక్ట్ విజయానంద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement