Monday, April 29, 2024

3.91లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ సాగు..

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యవసాయశాఖ ఖరీఫ్‌-2022 విస్తీర్ణ లక్ష్యాన్ని ప్రకటించింది. ఖరీఫ్‌ లో అన్ని పంటల సాగు విస్తీర్ణాన్ని 93.91 లక్షల ఎకరాలుగా నిర్దారించింది. ఖరీఫ్‌ సీజన్‌ లో ప్రధాన పంటగా ఉన్న వరి విస్తీర్ణ లక్ష్యం 40.34 లక్షల ఎకరాలు కాగా..18.40 లక్షల ఎకరాల్లో వేరుశెనగ, 14.82 లక్షల ఎకరాల్లో పత్తి, 6.62 లక్షల ఎకరాల్లో కందులు, 3.71 లక్షల ఎకరాల్లో చెరకు, 2.72 లక్షల ఎకరాల్లో మొక్కొజొన్న సాగవుతుందని అంచనా. ఖరీఫ్‌ సీజన్‌ కోసం ఈ ఏడాది ముందుగానే సాగునీరు విడుదల చేయాలని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో జూన్‌ మొదటి వారంలోనే ఖరీఫ్‌ నాట్లు పడేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది.

ఖరీఫ్‌ సీజన్‌ కు అవసరమైన ఎరువులు, విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా పకడ్బందీగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. మొత్తం రూ.196.70 కోట్ల విలువైన 6.84 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు- వెల్లడించారు. వరి విత్తనాలను జూన్‌ మొదటి వారంలో, వేరుశెనగ విత్తనాలను ఈనెల మూడవ వారం నుంచే పంపిణీ చేయనున్నారు. గిరిజన ప్రాంతాల్లో వరి, వేరుశెనగ విత్తనాలను వచ్చే వారం నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలను ఆర్బీకేల ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. విత్తనాలతో పాటు 19.02 లక్షల టన్నుల ఎరువులను కూడా ఖరీఫ్‌ సీజన్‌ లో పంపిణీ చేయనున్నారు. ఎరువుల కొరత రాకుండా ఆర్బీకేల్లో 1.5 లక్షల టన్నుల ఎరువుల నిల్వలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆర్బీకేల ద్వారా ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ లో 30 శాతం ఎరువులనూ, 10 శాతం పురుగు మందుల పంపిణీ చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement