Monday, April 29, 2024

Kesineni Nani – పార్టీ చేరిన ఒక్క రోజులోనే ఎంపీ టికెట్ కైవసం

( ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి ఎవరనే చర్చకు ముగింపు పలికారు. నిన్న మొన్నటివరకు ఎంపీ అభ్యర్థిగా పలు పేర్లను అధిష్టానం పరిశీలించింది. ఈ క్రమంలో మంత్రి జోగి రమేష్ పేరుతో పాటు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేరుని కూడా పరిశీలించింది. ఒకానొక దశలో ఎమ్మెల్సీ మొండితోకే అరుణ్ కుమార్ పేరును కూడా పరిగణాలకు తీసుకున్న అధిష్టానం అభ్యర్థిని ప్రకటించేందుకు మాత్రం నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చింది.

తాజాగా గురువారం రాత్రి ప్రకటించిన మలి విడత అభ్యర్థుల జాబితాలో కేశినేని నానికి విజయవాడ పార్లమెంటు టికెట్ కేటాయిస్తున్నట్లు అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇటీవలే వైసిపి లోకి వెళ్తున్నానని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని సీఎం జగన్ ను బుధవారం కలిశారు. గురువారం వెంటనే ఆయనకు ఎంపీ టికెట్ ను కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

ప్రజారాజ్యం పార్టీతో తన రాజకీయ కెరియర్ ను ప్రారంభించిన నాని విజయవాడ పార్లమెంటుతో ఎంతో అనుబంధాన్ని పెంచుకున్నారు. ఈ క్రమంలోనే అనూహ్యంగా 2013లో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న ఆయన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కష్టకాలంలో శక్తివంచన లేకుండా పనిచేశారు. 2014లో ఎంపీగా గెలిచిన ఆయన నియోజకవర్గానికి ఎనలేని సేవలు అందించారు.

ఇదే క్రమంలో 2019 వైసిపి ప్రభంజనంలో కూడా తట్టుకునే నిలబడి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా గెలుపొందారు. తన పార్లమెంట్ నిధులతో పాటు టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాల కోసం కోట్ల రూపాయలను ఏడు నియోజకవర్గాల పరిధిలో ఆయన ఖర్చు చేస్తూ వచ్చారు. అవినీతికి ఎక్కడా తావు ఇవ్వకుండా ప్రజాసేవ కోసమే నిరంతరం పనిచేస్తూ వస్తున్నా ఆయన ముక్కు సూటి మనస్తత్వంతో పార్టీలో కొందరికి విరోధులుగా మారారు.

గత కొంతకాలంగా జరిగిన తీవ్ర పరిణామాలు నేపథ్యంలో ఆయన ను టిడిపి అధినేత చంద్రబాబు పార్టీకి దూరంగా ఉండాలని వర్తమానం పంపించిన నేపథ్యంలో ఆయన పార్టీని వీడుతున్నట్లు ప్రకటించి, సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అయితే పార్లమెంటు సభ్యుడిగా తన రాజీనామా ఆమోదం పొందిన తర్వాతే వైసీపీలోకి వెళ్తానని కేశినేని ఇటీవలే ప్రకటించారు. గురువారం ప్రకటించిన పలు పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లలో విజయవాడ పార్లమెంట్ వైసిపి అభ్యర్థిగా కేశినేని నాని పేరును చేర్చి ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -

విజయవాడ పార్లమెంటుకు వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఏ వ్యక్తి మూడోసారి గెలిచిన సందర్భంగా లేని నేపథ్యంలో ఆ సెంటిమెంట్ కు కేశినేని నాని బ్రేక్ వేస్తారా లేదా అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement