విజయవాడ – ఎంపీ కేశినేని నానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి విజయవాడ ఎంపీ సీటు ఇచ్చేదిలేదని తేల్చి చెప్పిన క్రమంలో ఆయన స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు.. ఈ మేరకు ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ… పరోక్షంగా హింట్ ఇచ్చారు.. . తనని వద్దని చంద్రబాబే అనుకున్నారని, తాను అనుకోలేదని ఆయన అన్నారు. తన మీద, విజయవాడ ప్రజల మీద తనకు నమ్మకం ఉందని, తానేం చేయాలో కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తానని తాను ఇంతకు ముందే చెప్పానన్నారు. పదేళ్లుగా విజయవాడను ఎంతో అభివృద్ధి చేసిన తాను ఖాళీగా ఉంటే కార్యకర్తలు ఊరుకుంటారా ? అని ప్రశ్నించారు.
చంద్రబాబుకు తాను వెన్నుపోటు పొడవలేదని.. పొడిస్తే ఇంకా మంచి పొజిషన్ లో ఉండే వాడినని నాని చెప్పారు. విజయవాడ ఎంపీగా తాను హ్యాట్రిక్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీకి వెళ్లాలంటే ఒక ఫ్లైట్ కాకుంటే మరొక ఫ్లైట్ చూసుకోవాలని… ఏ ఫ్లైట్ లేకపోతే ప్రైవేట్ జెట్ లో వెళ్లాలి కదా.. అంటూ పార్టీ మార్పు గురించి సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. నామినేషన్ ల చివరి రోజు వరకు నాన్చకుండా ఎన్నికలకు చాలా ముందుగానే తనకు టికెట్ లేదని చెప్పారని, ఇందుకు చంద్రబాబుకు ధ్యాంక్స్ అని అన్నారు.
తాను మీడియాను పట్టించుకోవడాన్ని తాను ఎప్పుడో మానేశానని చెప్పారు. మీడియాకు మసాలా కావాలని… తినబోతూ రుచులెందుకని, ఒకేరోజు అన్ని విషయాల గురించి మాట్లాడటం ఎందుకని అన్నారు. మీడియా తన విషయంలో ఎన్ని రాతలు రాసుకున్నా భయం లేదని తేల్చి చెప్పారు కేశినేని నాని ..