Friday, May 3, 2024

ఎస్పీ ప్రారంభించిన ‘ఉమెన్ డ్రాప్ ఎట్ హోం’ సేవ‌ల‌కు ప్ర‌శంస‌లు

కాకినాడ పట్టణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో మహిళలు రాత్రిపూట ప్రయాణ సౌకర్యాలు లేక అభద్రతాభావంతో పడుతున్న ఇబ్బందులను గమనించి, కాకినాడ జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాథ్ బాబు వినూత్నమైన ఆలోచనతో మహిళలకు రాత్రి 9pm నుండి 5am ల మద్య, ఉమెన్ డ్రాప్ ఎట్ హోం పేరుతో ప్ర‌యాణ‌ సేవలను కాకినాడలో ఇటీవ‌ల ప్రారంభించారు.. ఇప్పటివరకు అనేకమంది మహిళలు ఈ సేవలను వినియోగించుకున్నారు.. ఈ సేవలో రాత్రి 9 గంటల తర్వాత మహిళలు ఒంటరిగా దూర ప్రాంతాల నుంచి కాకినాడకు వచ్చి, వారి గమ్యస్థానం చేరడానికి రవాణా సౌకర్యం లేకపోతే, పోలీస్ కంట్రోల్ రూమ్ 100/112 కు ఫోన్ చేయ‌వ‌చ్చు… ఫోన్ కాల్ అందుకున్న కొంత సేప‌టికే ఉమెన్ డ్రాప్ ఎట్ హోం వాహనం మహిళా కానిస్టేబుల్ తో వచ్చి, ఆ మహిళలను గమ్యస్థానాలకు చేరుస్తున్నారు.


గత రాత్రి కుమారి కె. తేజస్వి విజయవాడ నుండి ట్రైన్ లో కాకినాడ కు రాత్రి 00.05 ని చేరుకున్నారు. ఆ స‌మయంలో ఆమె కు ఎటువంటి రవాణా సౌకర్యం దొరకక పోవడంతో, కాకినాడ జిల్లా పోలీసులు మహిళలకు సహకారంగా కాకినాడలో నడుపుతున్న ‘ఉమెన్ డ్రాప్ ఎట్ హోం’ సేవలు గుర్తుకు వచ్చి,వెంట‌నే కాకినాడ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి సాయం చేయమని అభ్య‌ర్ధించారు..వెంటనే కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ లో ఉన్న ఆమె వద్దకు ఉమెన్ డ్రాప్ ఎట్ హోమ్ వాహనం మహిళా కానిస్టేబుల్ తో చేరుకుంది. అదే సమయంలో నైట్ రౌండ్స్ విధులు నిర్వహించుచున్న ఇంద్ర పాలెం ఎస్ఐ ఎం నాగరాజు, ఉమెన్ డ్రాప్ ఎట్ హోమ్ మహిళా సిబ్బంది ఆ యువ‌తిని ‘ఉమెన్ డ్రాప్ ఎట్ హోమ్’ వాహనంలో కరప మండలం, పెనుగుదురు గ్రామం లో ఆమె ఇంటి వద్దకు భద్రంగా చేర్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అర్ధరాత్రి రవాణా సౌకర్యం లేక బాధపడుతున్న తనను ఆమె ఇంటికి, ఒక్క ఫోన్ కాల్ తో భద్రంగా చేర్పించిన కాకినాడ జిల్లా పోలీస్ ఎస్పీ కి, రాత్రి డ్యూటీలో ఉన్న మహిళా పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement