Tuesday, April 16, 2024

Joining – చంద్ర‌బాబు స‌మ‌క్షంలో ప‌లువురు వైసిపి నేత‌లు టిడిపిలో చేరిక

మంగ‌ళ‌గిరి – రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉన్నవారే టీడీపీలోకి వస్తున్నారని తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఓటమి ఖాయమని జగన్ కు అర్థమైందని వ్యాఖ్యానించారు. తణుకు, పెదకూరపాడు, గజపతినగరం, అమలాపురం నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇవాళ భారీ సంఖ్యలో టీడీపీలో చేరారు. వీరికి టీడీపీ అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ, ఇన్ని అరాచకాలు చేసిన వ్యక్తి సీఎంగా పనికిరారని అన్నారు. తాను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని, 28 ఏళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నానని, అందరి ఆశీస్సులతో రాష్ట్రానికి, తెలుగుజాతికి మంచి పేరు, గౌరవం తీసుకువచ్చానే తప్ప, ఎప్పుడూ అపఖ్యాతి తీసుకురాలేదని అన్నారు.

ఒక్క చాన్స్ అని అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అరాచకాలమయం చేశారని మండిపడ్డారు. ఇలాంటివి చూస్తుంటే మనసు కలచివేస్తుందని, ఒక్కోసారి రాష్ట్రం పరిస్థితి తలచుకుంటే రాత్రి నిద్ర కూడా రాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క చాన్స్ ఇస్తే… నాలుగు సంవత్సరాల 9 నెలల పాటు బాధపడాల్సి వచ్చిందని చంద్రబాబు వివరించారు. చివరికి దేవుడే దిక్కు అనే పరిస్థితికి వచ్చారని వ్యాఖ్యానించారు. కానీ, మన రాతను తిరగరాసే శక్తి మన చేతుల్లోనే ఉందని చంద్రబాబు ఉద్ఘాటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement