Monday, April 29, 2024

AP: పల్లె పల్లెలో జన హారం… పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం జ‌గ‌న్ సిద్ధం యాత్ర‌

ఊరూరా అక్కచెల్లెమ్మల హారతి
ఎండ‌ల‌ను సైతం లెక్క చేయ‌ని జ‌నం
ప‌ర‌వ‌ళ్లు తొక్కిన జ‌న ప్ర‌వాహం
జ‌గ‌న్ ఆత్మీయ ప‌ల‌క‌రింపులు
16వ రోజుకు చేరిన బస్సు యాత్ర

(ఆంధ్రప్రభ స్మార్ట్, ఏలూరు ప్రతినిధి) : ఎండలు మండి పోతున్నాయి. మధ్యాహ్నం వేడి సెగలు భగభగమంటున్నాయి. దప్పికతో అల్లాడే పరిస్థితి. అయినా.. ప్ర‌కృతి ప్రకోపాన్ని సైతం పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానీకం చలించలేదు. తమ భవిష్యత్తు కోసం పోరాడుతున్న సీఎం జగన్ వెంట మేమంతా సిద్ధం అంటూ జనం కదం తొక్కారు. దెందులూరు నియోజకవర్గం నారాయణపురంలో బసచేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం తన బస్సుయాత్రను ప్రారంభించారు. నిడమ్రరు, గణపవరం మీదుగా ఉండికి చేరుకున్నారు. పూర్తిగా పల్లె వాతావరణంలో సీఎం జగన్ బస్సుయాత్ర కొనసాగుతుంటే.. పల్లె పల్లె కదిలి వచ్చినట్టు జనం పరవళ్లు తొక్కారు. సీఎం జగన్ మాట కోసం, పలకరింపు కోసం జనం ఎదురుతెన్నులు చూశారు. ఆప్యాయంగా, ఆత్మీయంగా సీఎం పలకరిస్తుంటే.. ఆయన అభివాదంతో వైసీపీ శ్రేణులు ఉత్తేజంతో .. మళ్లీ సీఎం జగనన్నే అంటూ నినాదాలు మార్మోగాయి.

వైసీపీలోకి టీడీపీ నేతల వలస…
సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గానికి చెందిన అనేక మంది టీడీపీ నాయకులు వైసీపీలో చేరారు. టీడీపీ నేతలు ఆకుర్తి శేఖర్, గారటి వాసు, గౌడ సంఘం నేత మాదు గంగాధర్ కు పార్టీ కండువాలు కప్పి సీఎం జగన్ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి పాల్గొన్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ కీలక నేత వైసీపీలో చేరారు. 2019 గురజాల నియోజకవర్గం జనసేన అభ్యర్థి చింతలపూడి శ్రీనివాసరావు, డాక్టర్ అశోక్ కుమార్, దాచేపల్లి మండల జనసేన నేత మందపాటి దుర్గారావు, పిడుగురాళ్ల తెలుగు యువత మాజీ అధ్యక్షుడు ఎన్.పేరయ్య, టీడీపీ సీనియర్ నేత గుంటుపల్లి రామారావుకు పార్టీ కండువా కప్పి సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement