Saturday, April 27, 2024

జల్లికట్టు జోరు, హెచ్చరికలు బేఖాతర్‌.. ఏపీ సరిహద్దు జిల్లాల్లో మొదలైన ఆట

అమరావతి, ఆంధ్రప్రభ : సంక్రాంతి సంబరాలు అంటే మన రాష్ట్రంలో కోడి పందాలు.. పొరుగున ఉన్న తమిళనాడులో జల్లి కట్టు గుర్తుకు వస్తాయి. ఈ ఏడాది వేడుకలు రాష్ట్రంలో ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. దాదాపు మూడేళ్లు కరోనా కాలం నుంచి బయటపడ్డాక ఇప్పుడిప్పుడే ప్రజా జీవనం సాధారణమైంది. దీంతో దసరా, నూతన సంవత్సర వేడుకలు వైభవంగా జరుపుకున్న జనం సంక్రాంతి సంబురాలను కూడా అంబరాన్నంటేలా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే రాష్ట్రంలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. సంక్రాంతి అనగానే ముందుగా రాష్ట్రంలో కోడి పందాలకు ప్రాధాన్యత. పొంగల్‌గా పిలువబడే తమిళనాడులో జల్లికట్టుకు అత్యంత ప్రాముఖ్యత.

అయితే తమిళనాడు సంప్రదాయ జల్లికట్టు మన రాష్ట్రంలో కూడా చాలా సంవత్సరాల నుంచి జరుగుతోంది. తమిళనాడు, ఆంధ్రా సరిహద్దు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జల్లికట్టు ఏటా నిర్వహిస్తున్నారు. రాను రాను కోడి పందాలు జూదానికి పేరుగా మారిపోయిన క్రమంలో పోలీసుశాఖ ఆంక్షలు విధించింది. ఇదే మాదిరిగా జల్లికట్టుపై కూడా రాష్ట్రంలో నిషేధం నడుస్తోంది. జంతు హింసను తలపించే జల్లికట్టు ఆట మానవ ప్రాణాలకు కూడా ప్రమాదంగా మారింది. ఈక్రమంలో రాష్ట్ర పోలీసుశాఖ సీరియస్‌గా పరిగణించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు జల్లికట్టు పై పూర్తి నిషేధం విధించింది. అయినా నిర్వహకులు మాత్రం పోలీసు హెచ్చరికలు బేఖాతర్‌ చేస్తూ తమిళనాడు, ఏపీ సరిహద్దు ప్రాంతాలైన చిత్తూరు జిల్లాలో ఇప్పటికే జల్లి కట్టు నిర్వహించేస్తున్నారు.

పండుగ సమీపిస్తున్న తరుణంలో అనేక మంది గ్రామస్తులు జల్లి కట్టు నిర్వహణకు, వేడుకకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే ముమ్మరమయ్యాయి. ఏపీ, తమిళనాడు బోర్డర్‌ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో జరిగే జల్లి కట్టు ఆటలో పాల్గొనేందుకు, తిలకించేందుకు, పందాలు కాసేందుకు అధిక సంఖ్యలో తమిళనాడు నుంచి కూడా తరలివస్తున్నారు.

- Advertisement -

సంక్రాంతికి ముందే ఆట మొదలు..

జల్లి కట్టు అంటేనే ఎద్దులను మచ్చిక చేసుకోవడం.. వాటితో పోటీ పడుతూ చేతులతో మాత్రమే ఎద్దులను లొంగదీసుకోవాలి. ఈ ప్రయత్నంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం, తీవ్ర గాయాలతో అంగవైకల్యంతో మిగిలిపోవడం వంటి దురదృష్టకర పరిణామాలు జరుగుతున్నాయి. సంక్రాంతి సంబరాల కంటే ముందుగానే చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శానంబట్లలో కొత్త సంవత్సరం తొలి రోజే జల్లికట్టు సంబరాలు ప్రారంభమయ్యాయి. గ్రామస్థులు తమ పశువులను అందంగా అలంకరించి పరుగులు పెట్టించారు. ఈ జల్లికట్టుని చూడడానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి భారీ సంఖ్యలో జనం వచ్చారు. పరుగులు పెట్టే పశువులను నిలువరించి వాటి కొమ్మలకు కట్టిన పలకలను చేజిక్కించుకునేందుకు యువకులు తెగ పోటీ పడ్డారు.

పశువుల కొమ్ములకు రాజకీయ నాయకులు, సినీ హీరోల పోటోలతో బహుమతులను పలకులకు కట్టి జల్లికట్టులో వదిలారు. మరోవైపు జల్లికట్టుకు అనుమతి లేదని పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేసినా.. తోసిరాజని ఏ మాత్రం లెక్క చేయకుండా ఆట కానిచ్చేశారు. అసలు విషయమేమిటంటే స్ధానిక అధికార నాయకత్వం అండదండలు ఉండటం వల్లే నిరాటకంగా నిర్వహించారని, పోలీసు సైతం కేవలం హెచ్చరికలకు మాత్రమే పరిమితమై చూస్తూ ఉూరకుండిపోయారనే విమర్శలు వెల్లు వెత్తాయి.

పోలీసు స్పెషల్‌ డ్రైవ్‌ షురూ..

రాష్ట్రంలో జల్లి కట్టు నిర్వహణపై పోలీసుశాఖ విమర్శలు ఎదుర్కొంటున్న క్రమంలో స్పెషల్‌ డ్రైవ్‌ షురూ చేశారు. రాజకీయ మద్దతు ఉందనే ఆరోపణల నేపధ్యంలో అప్రమత్తమైన తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లాల ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జల్లికట్టు సందర్భంగా ప్రమాదాలు చోటు-చేసుకుంటున్నాయని చెబుతూ ఆంక్షలు విధిస్తున్నారు. జల్లికట్టు నిర్వహిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించడంతోపాటు ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇందుకు సంబంధించి ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా తిరుపతి జిల్లా నూతిగుంటపల్లిలో జల్లికట్టు పోటీలను పోలీసులు అడ్డుకున్నారు. గ్రామంలో జల్లికట్టు కోసం స్థానికులు భారీ ఏర్పాట్లు చేశారు. వాటిని తొలగించిన పోలీసులు బైండోవర్‌ కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో గ్రామంలో భారీగా బలగాలను మోహరించారు.

జల్లికట్టు అడ్డుకోవడంతో పోలీసులు తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని అడ్డుకోవాలని చూడడం సరికాదని, ఆంక్షలు తొలగించాలని కోరుతున్నారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా కుప్పం గుడుపల్లి మండలం పెద్దూరులో జల్లికట్టు నిరాటకంగా కొనసాగుతోంది. జల్లికట్టు నిర్వహించకూడదని రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీచేసిన పట్టించుకోని గ్రామస్తులు సంక్రాంతి, కనుమకు ముందే ముమ్మరంగా ప్రారంభించేశారు. జల్లికట్టును వీక్షించేందుకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా తరలిరావడం గమనార్హం. పాల్గొనేందుకు కూడా ఆయా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఎద్దులను తీసుకువచ్చారు. ఓ వైపు ప్రభుత్వం నిషేధం పెట్టినా.. మరోవైపు పోలీసు ఆంక్షలు, స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగిస్తున్నా ఇవేమీ పట్టని నిర్వహకులు జల్లికట్టు ఆటను నిరాటకంగా కొనసాగించడం పట్ల మానవ, జంతు ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement