Friday, May 10, 2024

జైలు పిలుస్తోంది.. అందుకే ఢిల్లీకి ప‌రుగు.. జ‌గ‌న్ పై నారాయణ సెటైర్

తిరుపతి సిటీ, ఏప్రిల్ 21 (ప్రభ న్యూస్) : జైలు పిలుపు వ‌స్తుండ‌డంతో ఢిల్లీకి జ‌గ‌న్ ప‌రుగులు తీస్తున్నార‌ని సిపిఐ జాతీయ కార్యదర్శి డా. కే. నారాయ‌ణ వ్యాఖ్యానించారు. కేసుల భ‌యంతోనే జ‌గ‌న్ ఢిల్లీ యాత్ర‌లు చేస్తార‌ని నారాయ‌ణ అన్నారు. శుక్రవారం తిరుపతి సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దేశంలోని సంపదను కొల్లగొట్టి 30మందికి నరేంద్ర మోడీ పంచి పెడుతున్నారని, నాడు ఆలీబాబా 40 మంది దొంగలు అనే నానుడు ఉండేదని నేడు మోడీ బాబా 30 దొంగలుగా మారిందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ధ్వజమెత్తారు. 30 మందిలో 29 మంది ఇప్పటికే విదేశాలకు వెళ్లిపోయారని ఒక్క అదాని మాత్రమే మిగలగా అతనికి ప్రభుత్వ ఆస్తులు కట్టబెడుతున్నాడని పేర్కొన్నారు. ఈ 30 మంది మోడీ దత్తపుత్రులే అన్నారు. రాహుల్ పై అనర్హత వేటు వేయడం కక్షపూరిత చర్య అని అన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశానికి ఎంతో సేవ చేసిందన్నారు.

యూపీ మాజీ ఎంపీ అహ్మద్ ను పోలీసులు వలయంలో ఉండగానే హత్య చేశారన్నారు. బజరంగ్ దళ్ కార్యకర్తలు హత్య చేస్తుంటే పోలీసులు చూస్తూ ప్రేక్షక పాత్ర వహించారని చెప్పారు. గాడ్సే నోటి నుండి ఊడి పడిన వ్యక్తి నరేంద్ర మోడీ అని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అదానికి అప్పగిస్తే డంపింగ్ యార్డ్ గా మార్చివేస్తారని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను బీ ఆర్ ఎస్ టేక్ ఓవర్ చేస్తామని చెప్పినా జగన్ మోహన్ రెడ్డి స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. కేవలం తన చుట్టూ ఉన్న కేసులను మాఫీ చేసుకోవడానికి జగన్ ఢిల్లీ యాత్ర చేస్తున్నారు తప్ప రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం విభజన హక్కుల సాధన కోసం వెళ్లడం లేదని స్పష్టం చేశారు. సిబిఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మల మారిపోయిందన్నారు. రాష్ట్రంలో జగన్ బటన్ నొక్కడం తప్ప మరో అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం లేదన్నారు. రాష్ట్రం మొత్తం అవినీతిమయంగా మారిపోయిందన్నారు. దేశంలో ఇంతకంటే దిగజారుడు ముఖ్యమంత్రి మరొకరు లేర‌న్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు ప్రారంభించిన పథకాలను ఆపివేయడం శోచనీయమ‌న్నారు. ఆర్థిక నేరగాళ్లకు అధికార ప్రతినిధిగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓబులేసు, రాష్ట్ర సమితి సభ్యులు రామానాయుడు. సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, కుమార్ రెడ్డి, నగర కార్యదర్శి విశ్వనాథ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement