Friday, March 29, 2024

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఏంటి..?

రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ లేని ఇళ్లపై యజమానులు పూర్తి హక్కు పొందేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ పథకం వినియోగించుకోవడానికి ముందుకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 8,11,697 మంది ఈ పథకం కింద లబ్ధిపొందడానికి దరఖాస్తు చేసుకున్నారు. 


గృహ నిర్మాణ సంస్థ ద్వారా 1983 నుంచి 2011 మధ్య రుణాలు పొంది ఇళ్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం ఈ పథకంతో  పూర్తి యాజమాన్యం హక్కులు కల్పిస్తోంది. ఓటీఎస్‌ రూపంలో రూ.10వేల కోట్ల మేర రుణాలు మాఫీ చేసింది. దీంతోపాటు పేదలపై తలకు మించిన భారం మోపకుండా తక్కువ మొత్తంలో ధరలు నిర్దేశించి వాటిని చెల్లించిన వారికి ఇళ్లను రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తోంది. ఎటువంటి రుసుములు లేకుండా రిజిస్ట్రేషన్‌ చేయడం ద్వారా రూ.6వేల కోట్లు, ఇలా మొత్తంగా రూ.16 వేల కోట్ల మేర ప్రభుత్వం పేదలకు లబ్ధి చేకూరుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి.. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ప్రస్తుత గృహ అనుభవదారుడు ఎవరు? స్థలం, సరిహద్దులు గుర్తిస్తున్నారు. ఆ తర్వాత అర్హులను ఫైనల్ చేస్తున్నారు. నిర్దేశించిన రుసుము చెల్లించిన వారికి రిజిస్ట్రేషన్‌లు చేస్తారు.

స్వచ్ఛందంగా పథకం వినియోగించుకోవడానికి ముందుకు వచ్చిన వారి పేర్లపై ఇళ్ల రిజిస్ట్రేషన్లను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే చేస్తున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 26,023 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం రేపటి (మంగళవారం) నుంచి రిజిస్ట్రేషన్‌ ధ్రువపత్రాలను రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేపట్టనుంది. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రారంభించనున్నారు. ఈ ఇళ్లకు సంబంధించి రుణ గ్రహీతలు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి రూ.10 వేలు, మునిసిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్ల పరిధికి సంబంధించి రూ.20 వేలు చెల్లిస్తే ప్రభుత్వం స్థలాలపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ ధ్రువపత్రం జారీ చేస్తారు. ప్రభుత్వం నిర్ధేశించిన మొత్తం కన్నా వాస్తవ లబ్ధిదారులు గృహ నిర్మాణ సంస్థకు బకాయి ఉన్న రుణం తక్కువ ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. వాస్తవ లబ్ధిదారుడు నుంచి ఇల్లు కొనుగోలు చేసిన వారు, వారసులు గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేలు, మునిసిపాలిటీల్లో రూ.30 వేలు, కార్పొరేషన్లలో రూ.40 వేలు చెల్లిస్తే పూర్తి యాజమాన్య హక్కులు దక్కుతాయి.

మరోవైపు 2000 నుంచి 2014 మధ్య వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) వినియోగించుకుని, 2014–19 మధ్య ఓటీఎస్‌ లేకుండా రుణాలు చెల్లించిన వారికి కూడా ఇళ్లపై హక్కులు కల్పించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. 2000–2014 మధ్య 2.31 లక్షల మంది రుణాలు చెల్లించారు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో వడ్డీ, అసలుతో కలిపి 43 వేల మంది లబ్ధిదారులు గృహ నిర్మాణ సంస్థకు రుణాలు చెల్లించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement