Wednesday, May 8, 2024

ఎపి క్యాబినేట్ లో మార్పుల‌కు జ‌గ‌న్ అడుగులు…

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: మంత్రివర్గంలో స్వల్ప మార్పుల దిశగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అడుగులు వేస్తున్నారా..రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మరికొన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలని
యోచిస్తున్నారా.. గతంలో పార్టీ విధేయులకు పట్టం కడతానని ఇచ్చిన హామీ మేరకు కొత్త ఎమ్మెల్సీలకు అవకాశం కల్పించబోతున్నారా..అని అంటే పార్టీ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న శాసనమండలి ఎన్నికల తరువాత సీఎం జగన్‌ తన కేబినెట్‌లో నలుగురుని తొలగించి ఆస్థానంలో మండలి నుండి మరో నలుగురికి అవకాశం కల్పించేదిశగా ఆలోచిస్తున్నట్లు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ నలుగురు ఎవరన్న ఉత్కంఠ ఇటు పార్టీలోనూ, అటు మంత్రివర్గంలోనూ నెలకొంది. అయితే, గత ఏడాది మంత్రివర్గాన్ని పూర్తిగా రద్దుచేసి కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసిన సీఎం జగన్‌ ఎన్నికల వరకూ ఇదే టీం ఉంటుందని గతంలోనే ప్రకటించారు. అయితే, రాష్ట్రంలోని కొంత మంది మంత్రులపై తరచుగా ఫిర్యాదులు వస్తుండటం, మరికొంతమంది సీఎం జగన్‌ వేగాన్ని అందుకోలేకపోతుండటం తదితర కారణాలు వెరసి రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందిన మంత్రుల్లో నలుగురిని మార్చాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, ఆ నలుగురి స్థానంలో ఎమ్మెల్యేలు కాకుండా కొత్తగా మండలిలో అడుగుపెట్టబోతున్న ఎమ్మెల్సీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే మండలి అభ్యర్ధుల ఎంపికలో బీసీ మార్కు చూపిన సీఎం జగన్‌ మంత్రివర్గ మార్పులు చేపడితే నాలుగు స్థానాల్లో రెండు స్థానాలు బీసీ సామాజికవర్గానికే ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండు స్థానాల్లో కాపు, కమ్మ సామాజికవర్గాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని ఆదిశగా ఆయన కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

నలుగురుకి మూడింది
2019 మే 30వ తేదీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం జగన్‌ జూన్‌ 8వ తేదీ 25 మంది మంత్రులతో తన కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. ఆసందర్భంగా జరిగిన ప్రమాణ స్వీకార సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ, రెండున్నరేళ్లపాటు ఇదే టీం కొనసాగుతుందని, తరువాత మరికొంత మందికి అవకాశం కల్పించే క్రమంలో మరో రెండున్నరేళ్లు ఎన్నికల టీంకు అవకాశం కల్పిస్తానని హామీ ఇవ్వడంతోపాటు గత ఏడాది ఏప్రిల్‌లో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. వాస్తవానికి రెండున్నరేళ్ల లోపే మార్పులు చేయాల్సినప్పటికీ మరో ఆరు నెలలు అదనంగా అవకాశం కూడా ఇచ్చారు. అయితే, గత ఏడాది ఏప్రిల్‌లో ఏర్పాటైన మంత్రివర్గం ఎన్నికల వరకూ పనిచేస్తుందని సీఎం జగన్‌ స్వయంగా చెప్పారు. అయితే, వారిలో కొంత మంది సీఎం జగన్‌ సూచించిన విధంగా ఎన్నికల వేగాన్ని అందుకోలేక పోవడం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కూడా ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడం తదితర కారణాలు వెరసి రాయలసీమ జిల్లాకు చెందిన ఓ మంత్రితోపాటు కోస్తాలోని అమరావతి రాజధాని పరిధిలో మరో మంత్రి, గోదావరి జిల్లాల పరిధిలో ఒకరు, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మరో మంత్రిని తొలగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. శాఖల పరిధిలో వారు పట్టు సాధించకపోవడం ఆయా శాఖల పరిధిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుండటంతో సీఎం జగన్‌ ప్రత్యేకంగా ఆనలుగురినే తొలగించాలని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. వాస్తవానికి మంత్రివర్గంలో మార్పులు చేసే ఆలోచన సీఎం జగన్‌కు లేనప్పటికీ కొంత మంది మంత్రుల పనితీరు ఆశించినస్థాయిలో లేకపోవడంతో ఆయన ఆదిశగా నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

మండలి నుండే ఆ నలుగురు
గతంలో సీఎం జగన్‌ శాసన మండలి నుండి ఇద్దరికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. అయితే, వారిద్దరికి రాజ్యసభలో అవకాశం కల్పించి ఢిల్లికి పంపారు. దీంతో మండలి నుండి జగన్‌ కేబినెట్‌లో ప్రాతినిధ్యం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న మండలి ఎన్నికలకు సంబంధించి మార్చి 16వ తేదీ ఫలితాలు వెలువడనున్నాయి. ఈనేపథ్యంలో మంత్రివర్గంలో మార్పులు చేపట్టే క్రమంలో మండలి నుండే ఆనలుగురికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని సీఎం జగన్‌ యోచిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న శాసనమండలి ఎన్నికల్లో 23 స్థానాలకు సంబంధించి మూడు ఉపాధ్యాయ, రెండు పట్టభద్రులు, 9 స్థానిక సంస్థల కోటాతోపాటు ఏడు ఎమ్మెల్యే, రెండు గవర్నర్‌ కోటాలో నామినేట్‌ చేయనున్నారు. ఆయా స్థానాలకు సంబంధించి మార్చి 29, మే 1వ తేదీతో ప్రస్తుత ఎమ్మెల్సీలకు పదవీ కాలం ముగియనుంది. కొత్తగా గెలుపొందేవారు ఆతరువాతే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఈనేపథ్యంలో మండలి ఫలితాల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేపడతారా..లేక ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మార్పులు చేర్పులకు నిర్ణయం తీసుకుంటారా అనేది వేచి చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement