Tuesday, April 30, 2024

ఇన్వెస్ట‌ర్స్ గ్లోబ‌ల్ మీట్ – 14 ప్రధాన రంగాలలో పెట్టుబ‌డులు రాబ‌ట్టేందుకు వ్యూహం..

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మార్చి 3, 4 తేదీల్లో విశాఖ కేంద్రంగా నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌లో పెట్టు-బడుల ఆకర్షణ కోసం ప్రభుత్వం 14 ప్రధాన రంగాలను ఎంపిక చేసింది. ఈ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో వీటిని హైలైట్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. వీటిలో ఏరోస్పేస్‌, రక్షణ రంగం, వ్యవసాయం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఆటొ మొబైల్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ, పునరుత్పాదక ఇంధనం, పెట్రోలియం, పెట్రోకెమి కల్స్‌, ఆరోగ్య సంరక్షణ మరియు వైద్య పరికరాలు, పారిశ్రామిక మరియు లాజిస్టిక్‌ మౌలిక సదుపా యాలు, నైపుణ్య అభివృద్ధి, విద్య, ఎంఎస్‌ఎంఈల స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, వస్త్రాలు, దుస్తులు, పర్యాటకం, ఆతిథ్యం, ఫార్మాస్యూటికల్స్‌, లైఫ్‌ సైన్సెస్‌, ఉన్నత విద్య వంటి రంగాలు ఉన్నాయి. వీటన్నింటిని క్షేత్రస్థాయి నుండి వివరించేలా అధికార యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా యాక్షన్‌ ప్లాన్‌ను రెడీ చేస్తోంది. ఇదే సమయంలో ఈ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే తమ పెట్టుబుడులు ఎప్పటిలోగా, ఏ విధంగా తిరిగొస్తాయన్న దానిపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. ఇక పెట్టుబడులు రాబట్టుకోవడంతోపాటు లాభాలు పొందేందుకు ఉన్న అవకాశాలు, అందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, ఇక్కడున్న వనరులను తక్కవు ఖర్చుతో వినియోగించుకునే తీరు వంటి తదితర అంశాలపై కూలంకుశంగా పెట్టుబడుదారులకు అధికార యంత్రాంగం సవివరంగా తెలియజేయనుంది.

25 దేశాలు 7,500 మంది ప్రతినిధుల రాక
పరిశ్రమ వర్గాలతోపాటు విదేశాలకు చెందిన 7,500 మంది ప్రతినిధులు ఈ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌లో పాల్గొనడానికి తమ పేర్లను ఇప్పటికే నమోదు చేసుకున్నారు. రెండు రోజుల పాటు- జరిగే ఈ కార్యక్రమానికి 25 దేశాల నుంచి ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. అయితే, ఈ సంఖ్య దాదాపు 40కు చేరే అవకాశం కూడా ఉందని ఓ సీనియర్‌ అధికారి ఆంధ్రప్రభకు తెలిపారు. ఇప్పటికే దేశంలోని వివిధ పట్టణాల్లో నిర్వహించిన రోడ్‌ షోలకు పెట్టుబడుదారులనుండి అనూహ్య స్పందన లభించిందని చెప్పారు. ఇప్పటికే దేశంలో తమ కంపెనీలను ఏర్పాటుచేసిన విదేశాలకు చెందిన పలు కంపెనీలకు ఆహ్వానాలు కూడా పంపామని, వారు కూడా ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఉత్సుకతతో ఉన్నారని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కలల ప్రతిరూపంగా ఈ సమ్మిట్‌ జరుగుతున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు.

కనెక్టివిటి ఒక పెద్ద ఆకర్షణ :
రైలు, రోడ్డు నెట్‌వర్క్‌, రైల్వేలు, వాయు, జల మార్గాలను కలిగి ఉన్న విశాఖపట్నం దిగ్గజ రంగాలలో పెట్టు-బడులకు అత్యంత అనువైనదిగా దిగ్గజ కంపెనీలు భావిస్తున్నాయి. విశాఖ జిల్లాలో 48,352 ఎకరాల ల్యాండ్‌ బ్యాంక్‌ ఉన్నట్లు- ఇప్పటికే అధికారులు తెలిపారు. దీంతో పెట్టుబడిదారులకు ప్రధాన సమస్య అయిన భూమి సమస్య తప్పినట్లే. రాష్ట్రం మొత్తం జీడీపీలో విశాఖపట్నం సేవారంగం నుండి 55 శాతం, పరిశ్రమల నుండి 35 శాతం, వ్యవసాయం నుండి 10 శాతం వంతున పొందుతోంది. దీనిని ప్రకారం విశాఖపట్నంలో తలసరి ఆదాయం రూ.1,70,215గా నమోదైంది.

ప్రత్యేక ప్రోత్సాహక కార్యక్రమం
కొత్త పెట్టు-బడిదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో కొప్పర్తిలోని వైయస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌లో పెట్టు-బడిదారులకు ప్రోత్సాహక ప్యాకేజీ, వైయస్సార్‌ జగనన్న బడుగు వికాసం కింద ఎస్సీ, ఎస్టీ మరియు వెనుకబడిన కులాల పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, జౌళి, దుస్తులు మరియు గార్మెంట్‌ పాలసీ 2018-2023, ఆంధ్రప్రదేశ్‌ రి-టైల్‌ పార్క్‌ విధానం 2021-2026 మరియు ఆంధ్రప్రదేశ్‌ లాజిస్టిక్స్‌ పాలసీ 2022-2027 వంటివి ఉన్నాయి. ఇవి పెట్టుబడి దారులను మరింతగా ఆకర్షించేందుకు ఎంతగానో దోహదపడనున్నాయి.

- Advertisement -

రూ. 53.944 కోట్ల .. 71 వేల మందికి ఉపాధి
గత ప్రభుత్వం ఇప్పటివరకూ రూ. 53, 944 కోట్ల పెట్టు-బడితో 108 భారీ పరిశ్రమలను స్థాపించిందని, తద్వారా 71,056 మందికి ఉపాధి లభించిందని పరిశ్రమల శాఖకు చెందిన సీనియర్‌ అధికారి చెప్పారు. తమ కార్యకలాపాలను ప్రారంభించిన పరిశ్రమలలో ఏటీసీ -టైర్లు, అపోలో -టైర్లు, రామ్‌కో సిమెంట్స్‌, కియా మోటార్స్‌ మరియు హీరో మోటార్స్‌ మొదలైనవి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక గత మూడేళ్లలో చిన్న, మధ్యతరహా, సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించి రూ. 17,673 కోట్ల పెట్టు-బడితో 1,32,692 యూనిట్లను స్థాపించామని, దీంతో 9,99,030 మందికి ఉపాధి లభించిందని ఆయన వివరించారు.

ఉద్యోగాల విప్లవం
యువకుడైన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రాష్ట్రంలో యువతకు ఉపాధికోసం పరితపిస్తారని, అదే కోవలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి యువతకు ఉపాధి కల్పించేందుకు అవిరళ కృషి చేస్తున్నారని పార్టీకి చెందిన ఓ సీనియర్‌ నాయకుడు వెల్లడించారు. గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ అనేది ఆయన కలలకు రూపమని పేర్కొన్నారు. ఈ సమ్మిట్‌ ప్రారంభానికి ముందే ఇంత పెద్ద స్థాయిలో ఆశలు రేకత్తించడానికి అన్ని శాఖల అధికారుల పనితీరే కారణమన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలో అధికారులు, మంత్రులు పెద్ద ఎత్తున కృషిచేశారని పేర్కొన్నారు. ఈ సమ్మిట్‌ ద్వారా రాష్ట్రం పెద్ద ఎత్తున పెట్టుబడులను రాబట్టడం ద్వారా అవి వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం ఆమేరకు కమిటెడ్‌గా పనిచేస్తోందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement