Thursday, April 25, 2024

AP: ఓపిక ఉంటే జనాభాను పెంచండి… చంద్రబాబు

పిల్లలు దేశ సంపద
వీరి అవసరం చాలా ఉంది
మండుటెండ సైతం లెక్కలేదు
రాప్తాడు సభలో బాబు

అనంతపురం బ్యూరో, మార్చి 28 (ప్రభ న్యూస్) : ఓపిక ఉంటే జనాభాను పెంచండి.. పిల్లలు దేశ సంపద.. వారి అవసరం చాలా ఉందని, ఆడపిల్లలు పుడితే వారికి మరింత ప్రాధాన్యత ఇస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రజాగలం సభలో భాగంగా రాప్తాడులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రతి ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అన్ని 15వేల రూపాయలు ఇస్తుందని వెల్లడించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి గడిచిన ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. కరెంటు చార్జీలు అమాంతం పెంచేసి సామాన్యుల నెత్తిన భారం వేశారని విమర్శించారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, డీఎస్సీ కల్పిస్తామని మోసం చేశారని అన్నారు. తమకు ఓటు వేస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి దాని మాట మరిచిపోయారన్నారు. పోలవరాన్ని గోదావరిలో ముంచిన ఘనుడిగా అభివర్ణించారు.

జి బ్రాండ్ మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని తాడేపల్లిగూడెం ప్యాలెస్ కు మళ్ళించారని తెలిపారు. రాయలసీమలో అత్యధిక సీట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి సీమ ప్రజలకు తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. హంద్రీనీవా సుజల స్రవంతితో పాటు ఇతర ప్రాజెక్టులు ముందుకు సాగలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులను ఆదుకోవడమే కాకుండా, సబ్సిడీపై డ్రిప్ పరికరాలు పూర్తిస్థాయిలో అందిస్తామని పేర్కొన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. డ్వాక్రా వ్యవస్థను తీసుకువచ్చి మహిళలను ఆర్థికంగా ఎదగడంలో కృషి చేశామన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకు 3000 రూపాయల జీవన భృతి కల్పిస్తామని తెలిపారు. మెగా డీఎస్సీ పై తొలి సంతకం పెడతానని పేర్కొన్నారు. ఇంటింటికి మంచినీళ్లు పథకం ప్రవేశపెడతామన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం సంపదను సృష్టించిందని తెలిపారు. కియా పరిశ్రమ మొదలుకొని అనేక పరిశ్రమలను తీసుకొచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఇసుక దోపిడి కొనసాగడంతో 40 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎటువంటి తప్పు చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

మండుటెండలో సభ..

- Advertisement -

జిల్లాలో వేసవి ఎండలు మండిపోతున్నాయి. 40 డిగ్రీల ఒక పైగా ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ మండుటెండలో చంద్రబాబు నాయుడు ఏకధాటిగా గంటకు పైగా ప్రసంగం కొనసాగించారు. సభకు వచ్చిన జనం సైతం రోడ్డు మీద నిలబడి ఓపికగా విన్నారు.

రాప్తాడు అభివృద్ధికి పెద్దపీట వేయండి.. పరిటాల సునీత..

రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేయాలని, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలని, జాకీ పరిశ్రమ స్థానంలో కొత్త ఐటి పరిశ్రమను తీసుకురావాలని మాజీ మంత్రి పరిటాల సునీత చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో శాసనసభ్యుడు వ్యవహరిస్తున్న తీరు గురించి బాబుకు వివరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని లెక్కలు తేలుస్తామని బాబు హామీ ఇచ్చారు. సభలో పరిటాల శ్రీరామ్ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి జనసేన నాయకుడు పవన్ మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement