Saturday, May 18, 2024

Big Story: టౌన్‌షిప్‌లతో ఆదాయం, రైతుల ప్లాట్లలో మౌలిక వసతులు.. మరో 3 ఎల్‌పీఎస్‌ జోన్లలో పనులకు భూమిపూజ

అమరావతి, ఆంధ్రప్రభ: రాజధాని ప్రాంత అభివృద్ధికి సీఆర్డీఏ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. అమరావతి అభివృద్ధికి అవరమైన ఆర్థిక వనరుల సమీకరణలో భాగంగా కొత్తగా లేఅవుట్లు ఏర్పాటుచేసి ప్లాట్లను విక్రయానికి నిలపాలని నిర్ణయించింది. మరోవైపు రాజధాని నిర్మాణంలో భాగంగా భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకు అందించిన ప్రత్యామ్నాయ ప్లాట్లలో దశల వారీ మౌలిక వసతుల కల్పనకు నిధులు సమకూర్చుకుంటోంది.. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో మెగా ఇంజనీరింగ్‌ సంస్థతో పాటు బెంగుళూరుకు చెందిన మరో సంస్థలు పనులు చేపట్టేందుకు సీఆర్డీఏతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. తాజాగా సోమవారం మరో మూడు ఎల్‌పీఎస్‌ జోన్లలో అభివృద్ధి పనులకు సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌, ఇతర ఉన్నతాధికారులు భూమిపూజ నిర్వహించారు. తుళ్లూరు మండల పరిధిలోని దొండపాడు, తుళ్లూరు, రాయపూడి గ్రామాల్లో పనులు ప్రారంభమయ్యాయి. రైతుల ప్లాట్ల అభివృద్ధిలో భాగంగా రహదార్లు, వంతెనలు, తాగునీటి సరఫరా, వరదనీటి కాల్వలు, మురుగుునీటి శుద్ది కర్మాగారాలు, పచ్చదనం తదితర పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ తెలిపారు. రైతుల ప్లాట్లలో మౌలిక సదుపాయాలు, అమరావతి అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణకు ప్రణాళిక రూపొందించామని ఇంుదులో భాగంగానే టౌన్‌షిప్‌లను ముందుకు తెచ్చామన్నారు. ఎల్‌పీఎస్‌ జోన్ల అభివృద్ధితో పాటు రాజధానిలో ముఖ్యమైన మౌలిక వసతులు (ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) పనులను కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. రాజధాని ప్రాంతంతో అనుసంధానంగా ఉన్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును నాలుగు కూడళ్లలో మిగిలిన పనులు పూర్తి చేస్తామన్నారు. అభివృద్ధి పనులను సీఆర్డీఏ అదనపు కమిషనర్‌ అలీం బాషా, సీఆర్డీఏ సీఈలు టీ ఆంజనేయులు, సీహెచ్‌ ధనుంజయ, జేడీ టి చిరంజీవి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పీ సాయిబాబు, ఇతర అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కరకట్ట రోడ్డు విస్తరణతో పాటు అమరావతికి అంతర్గత రహదార్లకు సీఆర్డీఏ ప్రాధాన్యత ఇస్తోంది.

4 టౌన్‌షిప్‌లు రెడీ..అమ్మకానికి 100 ప్లాట్లు
సీఆర్‌డీఏ పరిధిలోని ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లో మరో నాలుగు టౌన్‌షిప్‌ల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. మధ్యతరగతి వర్గాలకు అందుబాటు ధరల్లో ఈ టౌన్‌షిప్‌లు రూపుదిద్దుకున్నాయి. సీఆర్డీఏ నిర్మించిన అంతర్‌వలయ రహదారి (ఇన్నర్‌ రింగ్‌రోడ్డు)కి అతి సమీపంలోని విజయవాడ (పాయకాపురం), విజయవాడ- హైదరాబాద్‌ ఎన్‌హెచ్‌ 16 రహదారి మార్గంలో ఇబ్రహీంపట్నం ట్రక్‌ టెర్మినల్‌, తాడేపల్లి- మంగళగిరి కార్పొరేషన్‌ పరిధిలోని అమరావతి టౌన్‌షిప్‌తో పాటు తెనాలి నగర నడిబొడ్డున (చెంచుపేట) టౌన్‌షిప్‌లలో ప్లాట్లను ఈ వేలం ప్రక్రియ ద్వారా విక్రయానికి సిద్ధమయ్యాయి. పాయకాపురం టౌన్‌షిప్‌ విజయవాడ నగరపాలక సంస్థలో అంతర్భాగం కానుంది. ఇదే టౌన్‌షిప్‌ను తాకుతూ ఇన్నర్‌ రింగురోడ్డు నిర్మాణమవుతుంది. దీంతో పాటు ఈ ప్రాంతం మీదుగా కృష్ణాజిల్లా పెద్దవుటుపల్లి వరకు బైపాస్‌ రోడ్డు నిర్మాణ దశలో ఉంది. మరోవైపు నూజివీడు- విజయవాడ ప్రధాన రహదారి, నున్న బైపాస్‌తో అనుసంధానంతో రవాణా సదుపాయం ఉంటుంది. ఈ టౌన్‌షిప్‌లో వాణిజ్య ప్లాట్లను చదరపు గజం రూ. 27,500తో పాటు సినిమా థియేటర్లు, ప్రాథమిక పాఠశాల, ఆరోగ్యకేంద్రం, డిస్పెన్సరీల నిర్మాణానికి ఐదు, మరో 29 నివాస ప్లాట్లను చదరపు గజం రూ. 25వేలుగా నిర్ణయించినట్లు సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ తెలిపారు. విజయవాడ- హైదరాబాద్‌ జాతీయ రహదారికి చేరువలో ఇబ్రహీంపట్నం ట్రక్‌ టెర్మినల్‌ టౌన్షిప్‌లో వాణిజ్యపు ప్లాట్లను చదరపు గజం రూ. 11వేల ధరకు విక్రయించనున్నారు. ఇక్కడ కార్యాలయాలు ఏర్పాటుకు 21, షాపులతో పాటు నాలుగు ఖాళీ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి చదరపు గజం రూ. 10వేలుగా సీఆర్డీఏ ధర నిర్ణయించింది. ఇక తెనాలి చెంచుపేటలో ఏర్పాట యిన టౌన్‌షిప్‌లో వాణిజ్య సముదాయాలు 12 ప్లాట్లు చదరపు గజం రూ. 35వేల200, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక పాఠశాల నిర్మాణానికి ప్లాట్లను కేటాయించారు. సినిమా థియేటర్లు, ఇతర వాణిజ్య అవసరాల నిమిత్తం ప్రభుత్వం నిర్ణయించిన విధంగా చదరపు గజం రూ. 32వేలకు విక్రయించనున్నారు. ఇక అమరావతి టౌన్‌షిప్‌లో మరో 18 వాణిజ్య ప్లాట్లు చదరపు గజం రూ. 17,600 చొప్పున, ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సినీ థియేటర్‌, ప్రాథమిక, ఉన్నత పాఠశాల నిర్మాణానికి చదరపు గజం రూ. 16వేలుగా ప్లాట్లను అమ్మకానికి నిలిపారు. ఈ నాలుగు టౌన్‌షిప్‌లలో ఈనెల 28వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ వేలం ద్వారా ప్లాట్లను విక్రయిస్తారు. దరఖాస్తులు మంగళవారం నుంచి ఈనెల 25వ తేదీలోగా కొనుగోలు పోర్టల్‌ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని సీఆర్‌ డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ వివరించారు. టౌన్షిప్‌లలో ప్లాట్ల అమ్మకానికి సంబంధించి సీఆర్డీఏ సిబ్బందిని నియమించింది. ఈనెల 12వ తేదీ నుంచి సిబ్బంది టౌన్షిప్‌లలో అందుబాటులో ఉంటారు. మొత్తంగా 100 ప్లాట్లను ఈ- వేలం ద్వారా అమ్మకాలు జరపాలని నిర్ణయించినట్లు కమిషనర్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement