Monday, April 29, 2024

Big Story | పల్నాడులో రంగురాళ్ల‌ వేట.. వజ్రాలు దొరుకుతున్నాయ‌ని ప్రచారం

గుంటూరు, ప్రభన్యూస్‌ బ్యూరో : పల్నాడులో రంగురాళ్ళ వేట మొదలైంది. తొలకరి జల్లులతో రంగురాళ్ళు, వజ్రాల కోసం జనం పరుగులు తీస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో విస్తారంగా ఉన్న రిజర్వ్‌ఫారెస్టులో నిషేధిత ఆంక్షలు ఉన్నాయి. కారణంలేకుండా ఫారెస్టు ప్రాంతంలోకి ఎవరిని అనుమతించరు. కాని రంగురాళ్ల కోసం కొంతమంది ప్రాణాలకు తెగించి మరీ తవ్వకాలు చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు కేసుల నమోదుతో కొంతకాలం ఆగిన తవ్వకాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. దాచేపల్లి మండలంలోని మాదినపాడు రిజర్వు ఫారెస్ట్‌లో శంకరాపురం, భట్రుపాలెం గ్రామాల మధ్యన కొండలపై కొంతకాలంగా రంగురాళ్ల కోసం తవ్వకాలు జరుగుతున్నాయి.

రాత్రి వేళల్లో ఎక్కువగా తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం. శంకరాపురం గ్రామానికి సమీపంలో ఉన్న కొండ పరిసర ప్రాంతాల్లో భూమిలో 20 నుంచి 30 అడుగుల లోపలికి తవ్వుకుంటూ వెళ్లి అక్కడ లభ్యమయ్యే స్పటికాలు, రంగురాళ్లను సేకరించి కొందరు అమ్మకాలు చేస్తున్నారు. ఇక్కడ దొరికే స్పటిక రాయికి మన దేశంలోని పలు రాష్ట్రాల్రతో పాటు చైనా సహా పలు దేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. నాణ్యతను బట్టి కేజీ రూ.2 వేల నుంచి రూ.20 వేల వరకు అమ్మకాలు జరుగుతుంటాయి.

ఈ స్పటిక రాళ్లను దేవతామూర్తులు, జపమాలలు, ఇతర ఆర్టికల్స్‌ తయారీకి ఉపయోగిస్తారు. ఇంత విలువైన స్పటికాలను సేకరించేందుకు కొందరు ప్రాణాలకు తెగించి మరీ తవ్వకాలు చేస్తున్నారు. భూమిలో 20 అడుగుల లోతు వరకు తవ్వుతూ వెళ్లి రంగురాళ్లను సేకరిస్తున్నారు. 20 అడుగుల గొయ్యి లోపల ఉన్న వ్యక్తికి ఆక్సిజన్‌ అందదు. అయినప్పటికీ ఆక్సిజన్‌ పైపులతో లోపలికి వెళ్లి ప్రాణాలకు తెగించి స్పటికాలను సేకరిస్తున్నారు.

క్యూ కడుతోన్న జనం..

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వజ్రాలు దొరుకుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో జనాలు భారీ సంఖ్యలో అక్కడికి క్యూ కట్టి.. వెతుకులాట ప్రారంభించారు. పిడుగురాళ్ల రోడ్డు శివారు ప్రాంతమైన బసవమ్మవాగు దగ్గర రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ వేశారు.. అక్కడ రోడ్ల కోసం బెల్లంకొండ నుండి తెచ్చిన ఎర్రమట్టిని పోశారు. ఈ విషయం తెలిసిన కొందరు వజ్రాలు, రంగు రాళ్లు దొరుకుతాయేమోనని వేట మొదలుపెట్టారు. వర్షం పడితే చాలు గుంపులు, గుంపులుగా వెళ్లి రోజంతా అక్కడే ఉండి రాళ్ల కోసం కోసం వెతుకుతున్నారు.

- Advertisement -

ఈ విషయం తెలియడంతో సత్తెనపల్లితో పాటుగా చుట్టుపక్కల ఉన్న నరసరావుపేట, చిలకలూరిపేట, ఒంగోలు, వినుకొండ ప్రాంతాల నుంచి కూడా వాహనాలలో జనాలు అక్కడికి వచ్చి ఒకటి దొరికినా చాలని వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు.

గతంలో బెల్లంకొండ మండలం కోళ్లూరులో వజ్రాలు దొరికాయనే ప్రచారం ఉంది. అక్కడ కూలీలను పెట్టి మరీ వజ్రాల కోసం గాలించారని చెబుతుంటారు. ఆ ప్రాంతం నుంచి తెచ్చిన మట్టి కావడంతోనే ఇలా గాలిస్తున్నారు. అందులో పక్కాగా వజ్రాలు, రంగు రాళ్లు ఉంటాయని నమ్ముతున్నారు.అంతేకాదు వజ్రాల టెస్టింగ్‌ మెషిన్‌లతో బంగారు వర్తక వ్యాపారుల దర్శనమిస్తున్నారు. బంగారు వ్యాపారులు -టెస్టింగ్‌ మెషీన్‌లతో వ్యాపారం ప్రారంభించి, ఒక్కో టెస్టింగ్‌కు రూ.100 తీసుకుంటున్నారు. గతంలో కూడా తొలకరి జల్లులు పడగానే పల్నాడు జిల్లాలోని స్థానికులు కోళ్లూరు వెళ్లి అక్కడ కొండల్లోనే ఉంటూ వజ్రాలు కోసం వెతికే వారని అక్కడి ప్రజలు చెబుతున్నారు.

ఇప్పుడు అదే నమ్మకంతో బసవమ్మ వాగు వద్ద జరుగుతున్న వజ్రాల వేట కొనసాగుతోంది. సాధారణంగా రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తొలకరి వానలు పడగానే వజ్రాల కోసం వేట ప్రారంభమవుతుంది. ఇటీవల పలువురు రైతులు, వ్యవసాయ కూలీలకు వజ్రాలు దొరికాయి. వాటిని దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీపడుతుంటారు. ఒక్క వజ్రం దొరికితే చాలు లక్షాదికారి, కోటీశ్వరులు కావొచ్చని ఆశగా వెళుతుంటారు. పల్నాడు జిల్లాలో కూడా అదే ఆశతో జనాలు వజ్రాల వేటకు వెళుతున్నారు.

తరచు పోలీసుల దాడులు
రంగురాళ్ల అక్రమ తవ్వకాలపై అటవీ, పోలీసు శాఖలు సంయుక్తంగా తరటు దాడులు చేస్తున్నాయి. ఇప్పటి వరకు 50కి పైగానే పోలీసులు కేసులు నమోదు చేశారు. చట్ట విరుద్ధంగా రాళ్లను సేకరించినా, తవ్వకాలు జరిపినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. శంకరాపురం గ్రామ సమీపంలోని కొండలపైన తవ్వకాలు జరుగుతుండడంతోపాటుగా కొత్తూరు సమీపంలో కొండలపై కూడా తవ్వకాలు జరుగుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement