Friday, May 3, 2024

ప‌ల్లె రోడ్లపై కాసుల వేట‌..

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: గ్రామీణ రహదారులను మరింత ఆధునీకరించి పల్లె ప్రజలకు మెరుగైన రోడ్డు సౌకర్యాలను కల్పించాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా పెద్దఎత్తున నిధులను వెచ్చిస్తోంది. ప్రత్యేకించి ఏపీ గ్రామీణ రహదారుల ప్రాజెక్టు (ఏపీఆర్‌ఆర్‌పీ)ను ప్రవేశపెట్టింది. 250మంది కంటే ఎక్కువ జనాభా కలిగిన ప్రాంతాలను అనుసందానం చేస్తూ నివాస ప్రాంతాల రహదారులతో వాటిని లింకు చేస్తుంది. అందుకోసం గడిచిన రెండేళ్లలో సుమారు రూ.835 కోట్ల రూపాయలను వెచ్చించి 4200 కిలోమీటర్ల మేర పల్లె రహదారులను ఆధునీకరించాలని లక్ష్యంగా నిర్ణయించు కుంది. అయితే పుష్కలంగా నిధులు అందుబాటులో ఉన్న ప్పటికీ కేవలం 1210 కిలోమీటర్ల మేర మాత్రమే గ్రామీణ రహదారులను అభివృద్ధి చేశారంటే రాష్ట్రవ్యాప్తంగా పల్లె రహదారుల ఆధునీకరణ లక్ష్యం ఏ స్థాయిలో ముందుకు సాగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా ప్రాంతాల రహదారుల ఆధునీకరణకు అవసరం అయిన నిధులను కేటాయించినా కొన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పనులను చేపట్టకుండానే నిధులను బొక్కేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది స్థానిక నేతలు కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి రోడ్ల పై కాసుల వేటను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగానే లక్ష్యాలకు దూరంగా, సమస్యలకు దగ్గరగా పల్లె రహదారుల ప్రాజెక్టు సాగుతుంది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రూ.125 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఆ నిధులతో సుమారు 2500 కిలోమీటర్ల రహదారులను అనుసందానం చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో అవసరం అయిన రోడ్లను ఆధునీకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అయితే ఆ ఏడాది కేవలం 564 కిలోమీటర్లు రహదారులను మాత్రమే అనుసందానం చేశారు. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రూ.710.76 కోట్లతో 1700 కిలోమీటర్ల మేర బిటి, సీసీ రోడ్లను నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే గత ఏడాది కూడా కేవలం 648 కిలోమీటర్లు మాత్రమే రహదారులను నిర్మించారు. మిగిలిన లక్ష్యాలు నీరుగారిపోయాయి.

వంద కోట్లు వెచ్చిస్తున్న..తీరు మారని గ్రామీణ రోడ్లు
రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 80,217 కిలోమీటర్ల మేర రహదారులు ఉన్నాయి. వాటిలో సిమెంట్‌ రోడ్లు, తారు రోడ్లు 32,749 కిలోమీటర్ల మేర ఉన్నాయి. అలాగే డబ్ల్యూబీఎం రహదారులు 8367 కిలోమీటర్లు, మట్టి రోడ్లు 39,101 కిలోమీటర్ల మేర ఉన్నాయి. పై రహదారుల నిర్వాహణ, మరమ్మత్తుల కోసం ప్రతి ఏటా ప్రభుత్వం గ్రామీణ రహదారుల ఆధునీకరణ కింద నిధులను కేటాయిస్తూ వస్తుంది. ఈ నిధులతో కొన్ని ప్రాంతాల్లో రహదారుల మరమ్మత్తులు, మరికొన్ని ప్రాంతాల్లో పునర్నిర్మాణం తదితర పనులను చేపడుతూ వస్తుంది. అదేవిధంగా 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం అయిన తారురోడ్లను పునరుద్దరణ పనులను కూడా చేపట్టేందుకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. అందుకోసం ప్రతీ ఏటా కొన్ని లక్ష్యాలను కూడా నిర్ణయించుకుంటోంది. అందుకోసం వందల కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది. గడిచిన రెండేళ్లలో రూ.835 కోట్లకు పైగా ఖర్చు చేసినా 1210 కిలోమీటర్లకు మించి రోడ్లను ఆధునీకరించలేకపోయింది. ఫలితంగా గ్రామీణ రహదారులు మరింత అధ్వానంగా తయారవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రయాణం చేయాలంటేనే ఇబ్బందికర పరిస్థితులు దర్శనమిస్తున్నాయి.

తాజాగా ప్రస్తుత ఏడాది రూ.746 కోట్లు కేటాయింపు
గతంలో కేటాయించిన నిధులకు అనుగుణంగా గ్రామీణ రోడ్ల పనులు సాగడం లేదు. అయినా ప్రభుత్వం మాత్రం ప్రతీ ఏటా పల్లెవాసుల కోసం మెరుగైన రహదారి వ్యవస్థ కోసం నిధులను కేటాయిస్తూనే ఉంది. తాజాగా 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి 746.80 కోట్ల రూపాయలను కేటాయించింది. ఆ నిధులతో 1700 కిలోమీటర్లను ఆధునీకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. అయితే గడిచిన రెండేళ్లలో లక్ష్యాలకు అనుగుణంగా నిర్మాణ పనులు జరగలేదు. మిగిలిన నిధులు ఏమైయ్యాయో..ఎటు వెళ్లాయో తెలియదు. అధికారులు మాత్రం తాజాగా కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. వాటిని పరిశీలించిన ప్రభుత్వం ప్రతిపాదనలకు అనుగుణంగా నిధులను కేటాయించింది. ప్రస్తుత ఏడాది అయినా లక్ష్యాలను అనుగుణంగా 1700 కిలోమీటర్లను ఆధునీకరిస్తారో..లేదో వేచి చూడాల్సి ఉంది.

మిగిలిన నిధులు ఏమైనట్లు..?
గ్రామీణ రహదారులను ఆధునీకరించేందుకు ప్రభుత్వం ప్రతీ ఏటా భారీగా నిధులను కేటాయిస్తుంది. పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ఆ దిశగా ఆయా ప్రాంతాల్లో రహదారులను ఆధునీకరించడం, 250 మందికి పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో కొత్త రోడ్లను నిర్మించి సమీపంలోని గ్రామాలకు వాటిని అనుసందానం చేస్తున్నారు. అయితే ఈ పక్రియలో ఎక్కడో పొరపాట్లు జరుగుతున్నట్లు అనేక సందర్భాల్లో కొన్ని సంఘటనల ద్వారా బయట పడుతున్నా అధికారులు మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన కొంతమంది కాంట్రాక్టర్లు రోడ్డు పనులను మమ అనిపిస్తూ సొమ్ములను దారి మళ్లిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో అయితే మొక్కుబడిగా మట్టిని పోసి రోడ్లను ఆధునీకరించినట్లుగా చూపిస్తున్నారు. ఫలితంగా వందల కోట్ల రూపాయలు నిధులు దుర్వినియోగం అయిపోతున్నాయి. పల్లె రహదారుల వ్యవస్థ మాత్రం బలోపేతం కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు ఆయా ప్రాంతాలకు కేటాయిస్తున్న నిధులు, ఆ దిశగా సాగుతున్న అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ప్రస్తుత ఏడాది కేటాయించిన నిధులు కాసుల వేటలో భాగంగా కాకులు తన్నుకుపోయే ప్రమాదం లేకపోలేదు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement