Thursday, May 2, 2024

వర్షాలే.. వర్షాలు.! నవంబర్​లో తుపాను హెచ్చరికలు జారీ

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో మరికొద్ది రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈనెల 20 తరువాత సిత్రాంగ్‌ తుపాన్‌ వస్తోందన్న ప్రచారాన్ని ఐఎండీ కొట్టిపారేసింది. నవంబర్‌లో వాయుగుండం తుపాన్‌గా బలపడే అవకాశం ఉందని సూచించింది. అల్పపీడన ప్రభావంతో మరి కొద్ది రోజులపాటు జోరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. సాధారణంగా అక్టోబర్‌ నెలలో నైరుతి రుతుపవనాలు వెనక్కి వెళ్ళే సమయంలో అల్పపీడనాలు ఏర్పడుతుంటాయన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు అల్పపీడనాలే కారణమని వాతావరణశాఖ సూచించింది. ఉత్తర అండమాన్‌ సముద్రం పరిసరాల్లో మంగళవారం మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతోందని, అది పశ్చిమ వాయువ్య దిశగా నైరుతి బంగాళాఖాతం వైపు పయనించి ఈనెల 20వ తేదీ నాటికి అల్పపీడనంగా మారుతోందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

దీని ప్రభావం కారణంగా కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, మరొకొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జనం అల్లాడిపోతున్నారు. అనంతపురం జిల్లా అతలాకుతలం అవుతోంది. అక్కడ ఇళ్ళలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. శ్రీ సత్యసాయి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నాయి. ఆయా జిల్లాల యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వాతావరణ పరిస్థితులపై జిల్లా యంత్రాగాలను అప్రమత్తం చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement