Tuesday, April 23, 2024

మరో రెండు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు.. పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరిక

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఆదివారం, సోమవారం రెండురోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి. విస్తారంగా వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐఎండి అంచనాల ప్రకారం తమిళనాడు నుండి మధ్యప్రదేశ్‌ వరకు రాయలసీమ, తెలంగాణ, విదర్భ మీదుగా ద్రోణి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా. బి.ఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు.

దీని ప్రభావంతో ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

- Advertisement -

అప్రమత్తంగా ఉండాలి..

విస్తారంగా వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఉరుములతో కూడిన వర్షం కురిసేపుడు పొలాల్లో పనిచేసే కూలీలు, పశు-గొర్రె కాపరులు చెట్ల కింద ఉండరాదని సూచించారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

నమోదైన వర్షపాతం..

రాష్ట్రంలో శుక్రవారం నమోదైన వర్షపాతం వివరాలు వాతావరణ శాఖ తెలియచేసింది. ఉదయం 8.30 గం.ల నుండి శనివారం ఉ.8.30గం.ల వరకు తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో 73.5 మిమీ, బాపట్ల జిల్లా రేపల్లెలో 48.75 మిమీ, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 47.25మిమీ, చిత్తూరు జిల్లా నగరిలో 44.5 మిమీ, నెల్లూరు జిల్లా వింజమూర్‌లో 41.5 మిమీ, గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో 26.25 మిమీ, ప్రకాశం జిల్లా కనిగిరిలో 26.5 మిమీ, కడప జిల్లా చాపాడులో 24.75 మిమీ వంతున జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement