Saturday, May 18, 2024

AP | అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు.. మహిళా కమిషన్ సీరియ‌స్ వార్నింగ్‌

అమరావతి, ఆంధ్రప్రభ: సోషల్‌ మీడియాలో మహిళలపై అభ్యంతరకర పోస్టులు పెడితే ఇక కఠిన చర్యలు తప్పవని మహిళా క మిషన్‌ స్పష్టం చేసింది. సోషల్‌ మీడియాలో మహిళల పట్ల పెరుగుతున్న అసభ్యకర వైఖరి రాతియుగం కంటే ఘోరంగా ఉందని పలువురు వక్తలు తీవ్రంగా ఖండించారు. సోషల్‌ మీడియా పట్ల సానుకూల అవగాహనే సైబర్‌ క్రైం నివారణకు మార్గమని అన్నారు. కాగా ఇకపై ప్రతి శుక్రవారం మహిళ ఆత్మగౌరవ దినంగా పాటించడం జరుగుతుందని మహిళా కమిషన్‌ ప్రకటించింది.

సోషల్‌ మీడియాలో మహిళలపై వేధింపులు అనే అంశంపై ఏపీ మహిళా కమిషన్‌ ఆధ్వర్యాన బుధవారం విజయవాడలో సెమినార్‌ జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షత వహించిన కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ మహిళలే మహిళలపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, రాజకీయ కారణాలతో వారిని మరి కొందరు ప్రోత్సహించటం దారుణమన్నారు. మార్ఫింగ్‌ ఫోటోలు పెట్టి మహిళలను కించపరుస్తున్న వారి భరతం పట్టాలని అన్నారు.మహిళలపై సోషల్‌ మీడియాలో పెస్టులు పెట్టినా, అసభ్యకరంగా ప్రవర్తించినా దిశ, సైబర్‌ మిత్ర తదితర యాప్‌ల ద్వారా పోలీస్‌ సహాయం పొందాలని సూచించారు.

- Advertisement -

విపక్ష మహిళా నేతల వాగ్వాదం
రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆధ్వర్యాన విజయవాడలో జరుగుతున్న సెమినార్‌లో పాల్గొనేందుకు టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన మహిళా నేతలు వచ్చారు. వారిని అడ్డుకున్న పోలీసులు లోనికి అనుమతించలేదు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. సెమినార్‌కు పిలిచి అవమానించడం మహిళా కమిషన్‌కు తగదంటూ టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత మండిపడ్డారు. పోలీసులకు, మహిళలకు నడుమ తీవ్ర వాగ్వివాదం చోటు- చేసుకుంది. మహిళలపై దాడులు, సోషల్‌ మీడియాలో వేధింపులపై సమావేశం జరుగుతుంటే ఎందుకు అనుమతించరంటూ నిలదీశారు.

శాంతియుతంగానే వెళ్లి మహిళలు ఎదుర్కొన్న సమస్యలు మహిళా కమిషన్‌ దృష్టికి వివరిస్తామని తెలిపారు. దీంతో కొంత మంది టీ-డీపీ, జనసేన మహిళా నేతలను లోపలికి అనుమతించిన వాసిరెడ్డి పద్మ సెమినార్‌ను రాజకీయం చేయవద్దని కోరారు. రాజకీయం చేయటం కోసం తాము రాలేదని, సమస్యలు చెప్పుకోవటానికి వచ్చామన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు. దీంతో రాజకీయ నేతల కోసం వేరొక సమావేశం ఏర్పాటు- చేస్తామని వాసిరెడ్డి పద్మ తెలిపారు. చైర్‌పర్సన్‌కు టీడీపీ, జనసేన మహిళలు వినతిపత్రం అందచేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement