Friday, May 17, 2024

చిర్రావూరిలో పశువైద్యశాలను పూర్తి చేయాలి

తాడేపల్లి,ఫిబ్రవరి20(ప్రభ న్యూస్) పశుసంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని,
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు అన్నారు. ఎంటి ఎంసీ పరిధిలోని చిర్రావూరు గ్రామంలో పశువులకు వ్యాధులు సోకుతున్నాయని సమాచారం తెలుసుకున్న ఆయన, రైతు సంఘం నాయకులతో కలిసి పాడి పశువులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు పాడి రైతులను వివరాలను అడిగి ఆయన తెలుసుకున్నారు. గ్రామంలో ఇప్పటికే గాలికుంటు వ్యాధి తో పశువులు ఇబ్బందులు పడుతున్నాయని, పశువులకు వ్యాధులు సోకినప్పుడు వైద్యం చేయించేందుకు సరైన ఆసుపత్రి లేకపోవడం వలన వేరే గ్రామాలకు వెళ్లాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందారు. ఈ సందర్భంగా శివశంకరరావు మాట్లాడుతూ తాడేపల్లి మండలంలోని అత్యధికంగా పశుసంపద ఉన్న గ్రామం చిర్రావూరు అని అన్నారు. పాడినే జీవనాధారం చేసుకొని రైతులు జీవిస్తున్నారని ఆయన అన్నారు.వేలాది రూపాయలు ఖర్చు చేసి, పశు పోషణ చేస్తున్న రైతులు, అనుకొని విధంగా పశువులకు జబ్బు చేస్తే సరైన వైద్యం చేయించుకునేందుకు, గ్రామంలో పశువుల ఆసుపత్రి లేకపోవడంవలన, అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఒక్కో సందర్భంలో పశువులు జబ్బు చేసి చనిపోతే లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లుతుందన్నారు. అనేక సంవత్సరాలుగా, అసంపూర్తిగా ఉన్న పశు వైద్యశాలను పూర్తి చేయడంలో పాలకులు నిర్లక్ష్యం వహించారని ఆయన విమర్శించారు. తక్షణమే గ్రామంలో అసంపూర్తిగా ఉన్న పశువైద్యశాలను పూర్తి చేసి, పశు వైద్యున్ని నియమించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు దొంతి రెడ్డి వెంకటరెడ్డి తాడేపల్లి మండల పశు వైద్యుడు నరేంద్ర రెడ్డిని ఫోన్లో సంప్రదించి, చిర్రావూరిలో పశువులకు వస్తున్న వ్యాధులకు వైద్యం అందించాలని ఆయన కోరారు. స్పందించిన పశు వైద్యుడు గ్రామంలోని పశువులకు పరీక్షలు నిర్వహించి, పశువులకు వస్తున్న వ్యాధులను నిర్ధారణ చేసుకొని, తగిన వైద్య సదుపాయాన్ని కల్పిస్తామని నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం తాడేపల్లి మండల నాయకులు దొంతి రెడ్డి వెంకటరెడ్డి, చిర్రావూరు గ్రామ రైతు సంఘం నాయకులు బొప్పన గోపాలరావు, మేడూరి పాములు., ప ల్లపాటి సుబ్బారావు, వ్యవసాయ కార్మిక సంఘం తాడేపల్లి మండల అధ్యక్షులు పరిమిశెట్టి శివ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement