Saturday, May 18, 2024

విద్యుత్ సౌకర్యం లేని జాలు మాలపల్లి – కనికరించని అధికారులు

తెనాలి రూరల్ : తాము అధికారంలోకి వస్తే జాలు మాలపల్లికి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వ పరిపాలకులు మాట ఇచ్చి తప్పారని, ప్రస్తుత పాలకులు కూడా తమగోడును పట్టించుకోవడం లేదని.. ఫలితంగా తాము తమ గృహాల్లో నివసించలేక పోతున్నామని, నందివెలుగు శివారు జాలుమాల పల్లి గ్రామ కాలనీవాసులు, కంట నీరు పెట్టుకుంటున్నారు. ఇరవై కుటుంబాలున్న తమ కాలనీ కి అధికారులు విద్యుత్ సౌకర్యం కల్పించడానికి ముందుకు రావటం లేదని, పాలకులు కూడా తమను పట్టించుకోవడం లేదని అక్కడి నివాసులు నాగమ్మ ఆ ప్రాంతాన్ని సందర్శించిన ప్రభన్యూస్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన మిలటరీ ఉద్యోగి కన్నెగంటి సూర్యనారాయణమూర్తి తమకు 50 ఏళ్ళ క్రితం ఈ స్థలాలు ఇచ్చి నివాసాలు ఏర్పరిచారని, వారి పంట పొలాల్లో 20 మంది పాలేరుగా పని చేసినందుకు కృతజ్ఞతగా తమకు స్థలాలు ఇచ్చారని తెలిపారు.

తాము రెండు తరాలుగా ఇక్కడే నివసిస్తున్నమని, విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో పాములు కరిచి ముగ్గురు చనిపోయారని, వర్షాకాలంలో బురదమయంతో అష్ట కష్టాలు పడుతున్నామని, ఎదిగివచ్చిన పిల్లలు చేతికి రావడంతో ఇక్కడ ఉండలేక ఊర్లో ఉంటున్నారని, తాము మాత్రం ఇక్కడే అలవాటుపడి ఎండైనా వానైనా వేరే గత్యంతరం లేక ఇక్కడే నివశిస్తున్నామని, వారు కన్నీరు పెట్టుకున్నారు. అధికారులు, పాలకులు తమ గోడును పట్టించుకోవడం లేదని.. ఇప్పటికైనా స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లి జాలు మాలపల్లి వారికి తగు న్యాయం చేయాలని విద్యుత్ సౌకర్యం కల్పించాలని వారు వేడుకుంటున్నారు. ఈ విషయమై రూరల్ విద్యుత్తు ఎ.ఇ.వసంతరావును వివరణ కోరగా, ఈ విషయం తమ దృష్టిలో ఉన్నదని, వారికి మీటర్లు ఇవ్వడానికి అభ్యంతరం లేదని, ఇప్పటికే వారంతా మీటర్లకు డబ్బులు చెల్లించారని, ల్యాండ్ ఓనర్ షిప్ పత్రాలు అందజేస్తే విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement