Friday, September 22, 2023

AP: ఎల్ఐసి పాలసీలపై జీఎస్టీని రద్దు చేయాలి…

ఎన్టీఆర్, ప్రభ న్యూస్ బ్యూరో : ఎల్ఐసి పాలసీలపై జీఎస్టీని రద్దు చేయాలని లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు రణవీర్ శర్మ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేపటి నుంచి మూడు రోజులపాటు విజయవాడ నగరంలో ఎల్ఐసి ఏజెంట్స్ జాతీయ మహాసభలు నిర్వహించనున్నట్లు ఆయన శుక్రవారం ప్రకటించారు. నగరంలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… నగరంలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో నేటి నుంచి మూడు రోజులపాటు తమ అసోసియేషన్ జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 3,000 మంది ఎల్ఐసి ఏజెంట్స్ ఈ జాతీయ మహాసభల్లో పాల్గొంటారని ఆయన తెలియజేశారు. ఎల్ఐసి సంస్థ అభివృద్ధికి, ఏజెంట్స్ సమస్యల పరిష్కారానికి సంబంధించిన పలు అంశాలపై ఈ జాతీయ మహాసభల్లో చర్చించి భవిష్యత్తు ప్రణాళిక ను రూపొందించనున్నట్లు ఆయన వివరించారు.

- Advertisement -
   

ఏజెంట్స్ కు సరైన ఉద్యోగ భద్రత లేకపోవడం వలన ఏజెంట్స్ వృత్తిని కొనసాగించలేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలసీదారులకు ఇచ్చే బోనస్ ను పెంచాలని, పాలసీదారులకు ఎక్కువ బోనస్ ఇస్తే మరింత మంది ఎల్ఐసి పట్ల ఆకర్షితులవుతారని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ప్రీమియం చెల్లింపులు ఆలస్యమైతే పాలసీలపై వసూలు చేస్తున్న వడ్డీరేట్లను తగ్గించాలని ఆయన ఎల్ఐసి సంస్థకు సూచించారు. ఎల్ఐసి రంగంలో వస్తున్న ఆదాయంలో సింహభాగం ఏజెన్సీ ద్వారానే వస్తోందని, అయితే ఏజెంట్స్ కు సరిగా రిటర్న్స్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ సూచనల మేరకు ఐదు శాతం ఉన్న కమిషన్ ను 7.5శాతంకు వెంటనే పెంచాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఏజెంట్ గ్రాడ్యుటీని వెంటనే పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇన్సూరెన్స్ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎల్ఐసి సంస్థపై ఉందని ఆయన సూచించారు. అనంతరం లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి గజపతి రావు, సౌత్ సెంట్రల్ జోన్ అధ్యక్షుడు మార్కండేయులు మాట్లాడుతూ… నేటి నుంచి ఎ ప్లస్ కన్వెన్షన్ లో జరిగే జాతీయ మహాసభలకు తొలి రోజున ముఖ్య అతిథులుగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎల్ఐసి సీనియర్ డివిజనల్ మేనేజర్ డాక్టర్ జి సుధాకర్ బాబు విచ్చేయున్నారని వివరించారు. రెండో రోజున జరిగే సభకు ముఖ్య అతిథులుగా ఎంపీలు వంగా గీత, కేసినేని నాని విచ్చేసి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. మూడో రోజున ఎల్ఐసి రంగం అభివృద్ధికి ఏజెంట్స్ సమస్యల పరిష్కారంపై చర్చించి భవిష్యత్ ప్రణాళికను రూపొందిస్తామని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement