Sunday, May 5, 2024

Big Story | ప్రభుత్వ బడులు హౌస్‌ఫుల్‌.. పలుచోట్ల నో వెకేన్సీ బోర్డులు

అమరావతి,ఆంధ్రప్రభ: పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు గత నాలుగేళ్లుగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలప్రదమౌతున్నాయి. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియంను ప్రవేశపెట్టడడం, జగనన్న విద్యా కానుక కిట్లు ఇవ్వడం, గోరుముద్ద, పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించిన కారణంగా తల్లితం డ్రులు ప్రయివేట్‌ స్కూళ్లు వద్దు ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అన్నట్లుగా ఆకర్షింపబడుతున్నారు. జూన్‌ 12వ తేదీ నుండి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. కొద్ది రోజుల్లో చాలా మున్సిపల్‌ స్కూళ్లలో అడ్మిషన్లు పూర్తయి పోయాయి.

అడ్మిషన్లు పూర్తయినప్పటికీ రోజూ తల్లితండ్రులు తమ పిల్లలు తీసుకొని స్కూల్‌ చుట్టూ తిరుగుతున్నారు. హెడ్మాస్టర్లు మాత్రం స్కూల్లో సామర్ధ్యం మేరుకు పిల్లలను చేర్చుకున్నామని, ఇంకా ఎక్కువ మందికి చేర్చుకోవడం సాధ్యం కాదని అంటున్నారు. కొన్ని చోట్ల నో వెకేన్సీ బోర్డులు కూడా పెట్టేస్తున్నారు. గుంటూరులోని గుజ్జనగుండ్ల ఎస్‌ఆర్‌ఆర్‌ మున్సిపల్‌ స్కూల్లో గత ఏడాది 440 మంది విద్యార్ధులు ఉంటే ఈ ఏడాది 540 మందికి పెరిగారు. ఇం క కొత్త విద్యార్ధులను తీసుకోలేము అని ఆ స్కూల్‌ హెడ్మాస్టర్‌ చెబుతున్నప్పటకీ రోజుకు 20 మంది చొప్పున స్కూల్‌కు వచ్చి వెళుతున్నారు. విజయవాడలోని ఎటిపి మున్సిపల్‌ స్కూల్లోనూ అదే పరిస్థితి. నెల్లూరు కెఎన్‌ఆర్‌ మున్సిపల్‌ స్కూల్‌లోనైతే నో వెకేన్సీ బోర్డునే పెట్టేశారు.

మంగళగిరి వీవర్స్‌ కాలనీలోని మున్సిపల్‌ స్కూల్లో 1100 మంది విద్యార్ధులు చేరారు. ఒకటి, రెం డు కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2015 మున్సిపల్‌ స్కూళ్లలోనూ ఇదే పరిస్థితి. ఒకప్పుడు ప్రయివేట్‌ స్కూల్లో చేరలేని వారు మున్సిపల్‌ స్కూల్లో చేరేవారు. ఇప్పుడు పరిస్థితి మారి మున్సిపల్‌ స్కూళ్లో సీటు దొరకని వారు ప్రయివేట్‌ స్కూల్‌కు వెళుతున్నారు. పాఠశాల విద్యను పటిష్టం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలిస్తున్నాయని, మున్సిపల్‌ టీచర్లు కూడా కష్టపడి చదువు చెప్పి పదో తరగతిలో దాదాపు 80 శాతంపైగా ఉత్తీర్ణతను సాధించారని, ఇది తల్లితండ్రుల్లో నమ్మకాన్ని పెంచిందని, అందుకే మున్సిపల్‌ స్కూళ్లకు డిమాండ్‌ పెరిగిందని గుంటూరు గుజ్జనగుండ్ల ఎస్‌ఆర్‌ఆర్‌ మున్సిపల్‌ స్కూల్‌ హెడ్మాస్టర్‌ రామకృష్ణ చెప్పారు.

గ్రామీణ ప్రాంత స్కూళ్లలోనూ పెరిగిన విద్యార్ధులు

- Advertisement -

మున్సిపల్‌ స్కూళ్లతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలకు అంత రద్దీ ఉండనప్పటికీ ప్రభుత్వ విధానాల కారణంగా ఈ స్కూళ్లలోనూ చేరే విద్యార్ధుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే హైస్కూళ్లలో గతం కంటే అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. అన్ని చోట్లనూ ఇది కనపడుతోంది. కొన్ని చోట్ల మాత్రం పెరగకుండా, తగ్గకుండా ఉన్నారు. నంద్యాల జిల్లాల్లోని గడియరేవుల హైస్కూళ్లో గత ఏడాది పదో తరగతి నుండి 64 మంది వెళ్లిపోగా ఈ ఏడాది పదో తగరితి లోకి మళ్లిd అంతే సంఖ్యలో విద్యార్ధులు వచ్చారు. అయితే 8,9 తరగతుల్లో మాత్రం 80 మంది కంటే ఎక్కువ మంది విద్యార్ధులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రదానంగా విద్యార్ధులు ప్రభుత్వానికే చెందిన రెసిడిన్షియల్‌ స్కూళ్లకు ఎక్కువ మంది వెళుతున్నారు. ఈ స్కూళ్లలో అడ్మిషన్ల సంఖ్య బాగా పెరుగుతోంది. మొత్తంగా చూసినప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రాధమిక విద్య బలోపేతం అవుతున్నట్లు కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement