Monday, April 29, 2024

AP: కరవు మండలాలకు సాయం అందించండి.. గవర్నర్ కు పీసీసీ అధ్యక్షుడు గిడుగు వినతి

ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో : వర్షాల్లేక రాష్ట్రవ్యాప్తంగా కరువు విలయతాండవం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రైతాంగం అల్లాడిపోతుందని, పెద్దమనసు చేసుకుని ప్రభుత్వం నుండి సహాయం త్వరితగతిన ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి ఆద్వర్యంలో గవర్నర్ అబ్ధుల్ నజీర్ ను ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధుల బృందం శుక్రవారం రాజ్ భవన్ లో కలిశారు.

రాష్ట్రంలోని కరవు స్ధితిగతులను గవర్నర్ కు గిడుగు రుద్రరాజు పూర్తిస్థాయిలో వివరించారు. ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా 685 మండలాలకు 103 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. 450మండలాలు కరువుతోటి అల్లాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంతో కుమ్మకై 103 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించారని ఆరోపించారు. కరువు కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్ధితి ఉందన్నారు. తీసుకున్న రుణాలు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారన్నారు.
అప్పుల భారిన పడి ఆత్మహత్యలు చేసుకున్న వారికి రూ.25 లక్షల నష్ట పరిహరం అందించాలన్నారు. ఎకరాకు రూ.50 వేల నష్ట పరిహారం అందజేయాలని విజ్ఞప్తి చేశారు. కౌలు రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. వలసలను నివారించే విధంగా ఉపాది హామీ పనులు చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన డిమాండ్లుగా వీటిని వివరిస్తూ గవర్నర్ కు రిప్రజంటేషన్ ఇచ్చామని గిడుగు రుద్రరాజు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement