Sunday, May 19, 2024

గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ ధరలకు అందించాలి.. కేంద్రానికి ఎంపీ చింతా అనురాధ వినతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను వినియోగదారులకు అందించాలని వైఎస్సార్సీపీ అమలాపురం పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆమె లోక్‌సభ జీరో అవర్‌లో మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా ఎల్పీజీ సిలిండర్ల ధరలు అధికంగా పెరిగాయని, ప్రస్తుతం మార్చి 1, 2022 నాటికి సబ్సిడీ, నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ల ధర 900 రూపాయలకు చేరి సామాన్య, మధ్య తరగతి, పేద కుటుంబాలకు భారంగా మారిందని వివరించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల చమురు, గ్యాస్ ధరలు పెరిగే అవకాశముందని తెలిపారు.

అలాగే ఎక్కువ శాతం సామాన్య గృహ వినియోగదారులకు సైతం ఎల్పీజీ సబ్సిడీ అందడంలేదని, ఒకవేళ అందినా తక్కువ మొత్తాన్ని సబ్సిడీగా అందిస్తున్నారని, సిలిండర్ ధరలో కొంత శాతంగా సబ్సిడీగా నిర్ణయిస్తే వినియోగదారులపై భారం తగ్గే అవకాశమవుందని సూచించారు. కరోనా మహమ్మారి కారణంగా చాలా కుటుంబాల ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని, మరోవైపు ద్రవ్యోల్బణం పెరిగిపోతుండడంతో అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని అనురాధ సభ దృష్టికి తీసుకొచ్చారు. తన సూచనలను కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖా మంత్రి పరిగణనలోకి తీసుకొని గృహ వినియోగదారులకు సబ్సిడీ ధరలకు సిలిండర్లు అందించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement