Thursday, May 16, 2024

Delhi: అవగాహన కోసమే, అవమానించాలని కాదు.. ప్రత్యేకహోదాపై అనవసర రాజకీయాలు : జీవీఎల్‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రత్యేక హోదా అంశం గురించి ఎంతో స్పష్టంగా వివరణ ఇచ్చినా సరే పదే పదే అదే అంశంపై ప్రశ్నలడుగుతూ రాజకీయం చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. బుధవారం న్యూఢిల్లీలోని తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రత్యేక హోదా విషయంలో 2015లో ఏం చెప్పామో అదే మాటకు కట్టుబడి ఉన్నామని, టీడీపీవైఎస్సార్సీపీలే మాట మార్చాయని ఆరోపించారు. “హోదా సంజీవని కాదు” అంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా జీవీఎల్ గుర్తు చేశారు.

ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ఆర్థిక సాయం చేస్తామంటే నాటి ప్రభుత్వం ఒప్పుకున్న విషయం అందరికీ తెలిసిందేనని గుర్తు చేశారు. నాడు ప్యాకేజీకి అంగీకరించి ఆ తర్వాత మాటమార్చిన విషయం నిజం కాదా అని జీవీఎల్ ప్రశ్నించారు. గజిని సినిమా చూసి ప్రభావితమయ్యారా అని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాకు, పన్ను రాయితీలకు ముడిపెడుతూ నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు.

వాస్తవాలను ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో వాటిని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చామని చెప్పారు. 98 పేజీల్లో “కేంద్ర సహకారం – రాష్ట్ర పార్టీల అసత్య ప్రచారం” పేరుతో పుస్తకాన్ని రూపొందించామన్నారు. పుస్తక కాపీలను మిగతా ఎంపీలు, ప్రజలకు పంపిణీ చేస్తామమని జీవీఎల్ తెలిపారు.

అప్పులపై పరిశీలన అవసరం
రాష్ట్రాలు పరిమితికి మించి చేసే అప్పుల గురించి రాజకీయాలకు అతీతంగా పరిశీలించాలని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రం, రాష్ట్రం చేసే అప్పులను ఒకే గాటన కట్టకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రాలు చేసే అప్పులకు కూడా కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టే అప్పుల విషయంలో ఆర్థిక క్రమశిక్షణ అవసరమని అన్నారు. శ్రీలంక పరిస్థితి నేపథ్యంలో చైతన్యం పొందాలన్నదే తమ ఉద్దేశం తప్ప రాష్ట్రాలను అవమానించడం ఉద్దేశం కాదని తేల్చి చెప్పారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంది? నాడు ఎందుకు బాధ్యతలు తీసుకుందని జీవీఎల్ ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో అదనవు చెల్లింపులు జరిపారని కమిటీ చెప్పాక, ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు.

ఓబీసీలకు న్యాయం చేయాలి
ఆంధ్రప్రదేశ్‌లో సరిగ్గా అమలు కాని కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించామన్నారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఏపీలో గత రెండు నెలలుగా అమలు కావడం లేదన్న ఆయన, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆహార భద్రత రాష్ట్రంలో ప్రశ్నార్ధకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ముద్ర యోజన కింద రూ. 65 వేలకోట్ల రూపాయల రుణ సదుపాయం కలిగిందని, 55 లక్షల మంది ఖాతాదారులకు రుణాలు అందాయని జీవీఎల్ నరసింహారావు తెలిపారు. స్వనిధి పథకం కింద 2.27 లక్షల మందికి రుణాలు మంజూరయ్యాయని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్షల మంది పట్టణవాసులకు గృహాలు మంజూరు చేశామని చెప్పారు.

- Advertisement -

కానీ వాటిని ఇప్పటివరకు లబ్ధిదారులకు అందజేసిన దాఖలాల్లేవని సందేహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 36 ఓబీసీ జాతులకు కేంద్ర జాబితాలో స్థానం దక్కకపోవడంపై వివరాలు సేకరించగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదనలు కేంద్రానికి ఇవ్వలేదని తేలిందని వెల్లడించారు. తూర్పు కాపులకు ఇస్తున్న ఓబీసీ రిజర్వేషన్ కూడా ఉత్తరాంధ్ర 3 జిల్లాలకే పరిమితమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి ఓబీసీ కులాలకు, కాపులకు న్యాయం చేయాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. భోగాపురం బీచ్ కారిడార్ కోసం కేంద్రం కోరిందని, అది అందిన వెంటనే మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని జీవీఎల్‌ఎన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement