Wednesday, May 1, 2024

Fishers Clashes – స‌ముద్ర స‌రిహ‌ద్దులు ఇక ప‌క్కా…

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మత్స్యకారుల మధ్య తరచుగా సముద్రంలో యుద్ధం జరుగుతోంది. తమిళ జాలర్లు సరిహద్దు దాటి ఏపీ పరిధిలోకి ప్రవేశించి విలువైన మత్స్య సంపదను దోచుకెళ్తున్నారు. హైస్పీడ్‌ బోట్లతో తడ నుంచి బాపట్ల వరకు సముద్రంలో వేటాడి భారీగా చేపలను సరిహద్దు దాటించేస్తున్నారు. ఇలా పరిధి దాటి వేటకు వచ్చిన ప్రతిసారి రెండు రాష్ట్రాల జాలర్ల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అనేక సందర్భాల్లో మత్స్యకారుల విలువైన ప్రాణాలతో పాటు ఖరీదైన వేట సామగ్రిని కూడా నష్టపోవాల్సి వస్తోంది. సంవ్సరాల తరబడి సముద్ర తీరాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఏపీ మత్స్యకారులు ఎదుర్కొంటున్న పై సమస్యను పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఆప్కాఫ్‌ చైర్మన్‌ కొండూరు అనిల్‌బాబులకు ఆ బాధ్యతలు అప్పగించారు. వీరు ఒకట్రెండు రోజుల్లో ప్రత్యేక సమావేశమై సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. తమిళ జాలర్లు పరిధి దాటకుండా చట్టపరంగా చర్యలు కూడా తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అవసరమైతే తమిళనాడు ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపి ఆ రాష్ట్ర మత్స్యకారులు ఏపీ పరిధిలోకి రాకుండా సముద్రంలో పటిష్టమైన పరిధిని ఏర్పాటు చేయబోతున్నారు. అందుకోసం సోమవారం కీలక సమావేశం కూడా జరగనుంది.

జాలర్ల సరిహద్దు వివాదంపై దృష్టి
ఏపీ పరిధిలో సుమారు 1075 కిలో మీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. వాటి పరిధిలో సుమారు 10 జిల్లాలకు సంబంధించిన 500కు పైగా మత్స్యకార గ్రామాలు జీవనం సాగిస్తున్నాయి. పొరుగున ఉన్న తమిళనాడు తడ సరిహద్దు ఆ రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు తడ అవతలి వరకే చేపల వేటను చేపట్టాలి. అయితే కొంతమంది మత్స్యకారులు హైస్పీడ్‌ బోట్లతో భారీ వలలు విసురుతూ ఏపీ పరిధిలో మత్స్య సంపదు దోచుకెళ్తున్నారు. తరచుగా వారు పరిధి దాటి వస్తుండడంతో నెలలో రెండు మూడు సందర్భాల్లో రెండు రాష్ట్రాల జాలర్ల మధ్య సముద్రంలోనే యుద్ధం జరుగుతుంటుంది. కొంతమంది మత్స్యకారులైతే బోట్లతో ఢీకొడుతుంటారు. దీంతో గతంలో అనేక సందర్భాల్లో పలువురు మత్స్యకారులకు గాయాలు కాగా, మరి కొంతమంది సముద్రంలో పడి ప్రాణాలు కూడా కోల్పోయారు . ఘర్షణలు జరిగే సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి తమిళ జాలర్లను అదుపులోకి తీసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో తమిళ జాలర్లు అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన వేట సామగ్రితో ఏపీ పరిధిలోకి దూసుకొస్తున్నారు. ఈ ప్రాంత జాలర్లు వారిని అడ్డుకునే లోపే హైస్పీడ్‌ సామగ్రిని తమ వేటను పూర్తి చేసుకుని తమిళనాడు సరిహద్దులోకి వెళ్లిపోతున్నారు. ఇలా వెళ్లిన ప్రతిసారి సరిహద్దులో యుద్ద వాతావరణం కనిపిస్తోంది. మత్స్యకారులు కూడా రోజుల తరబడి సముద్రంలోనే ఉండి ఆర్థికంగా కూడా నష్టపోవాల్సి వస్తోంది. విషయం తెలుసుకున్న సీఎం జగన్‌ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించి ఏపీ మత్స్యకారులకు పూర్తిగా అండగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

సమస్య పరిష్కరించేందుకు రంగంలోకి దిగిన ఏపీ ప్రభుత్వం
ఏపీ మత్స్యకారుల సమస్యను పరిష్కరించడంతో పాటు సముద్రంలో చేపల వేటను చేపట్టే మత్స్యకారులకు విలువైన వేట సామగ్రిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ దూరం ప్రయాణం చేసే హైస్పీడ్‌ బోట్లతో పాటు చేపల వేటకుఅవసరమైన వలలను కూడా వారికి అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అందుకు అవసరమైన నిర్ణయాలు కూడా దాదాపుగా సీఎం జగన్‌ తీసుకున్నారు. అందుకోసం ప్రత్యేకంగా కమిటీని కూడా ఏర్పాటు చేశారు. సోమవారం సమావేశమయ్యే కమిటీ మత్స్యకారులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడంతో పాటు సరిహద్దులో తమిళ జాలర్లు పరిధి దాటి రాకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోబోతున్నారు. అదే జరిగితే ఏపీ మత్స్యకారులకు సరిహద్దు సమస్య నుంచి విముక్తి లభించడంతో పాటు సరిహద్దులో ప్రశాంత వాతావరణం కూడా దర్శనమిచ్చే అవకాశం ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement