Monday, February 26, 2024

Krishnapatnam – నేటి నుంచి వేణుగోపాలస్వామి వారి మహా కుంభాభిషేక మహోత్సవాలు

  • 13.5 కోట్ల వ్యయంతో వేణుగోపాలస్వామి ఆలయ పునరుద్ధరణ
  • ఐదు సంవత్సరాలు పాటు సాగిన ఆలయ నిర్మాణ పనులు
  • 2017 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం శంకుస్థాపన ప్రస్తుత ప్రభుత్వంలో ఆలయం పనులు పూర్తి
  • ఏడంతస్తుల రాజగోపురంతో కళకళలాడుతున్న ఆలయం
  • మూడు రోజులపాటు నూతన శిలా విగ్రహ జీవ ధ్వ‌జ ప్రతిష్ట మహా కుంభాభిషేక మహోత్సవాలు
  • ఏర్పాట్లు పూర్తిచేసిన ఆలయ పాలకమండలి, దేవదాయ ధర్మాదాయ శాఖ
  • రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రాక

ముత్తుకూరు, జూన్ (ప్రభ న్యూస్) : రాష్ట్రంలోని అతి పురాతన దేవాలయాల్లో కృష్ణపట్నం గ్రామంలోని రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ ఆలయాన్ని ప్రాచీన కాలంలో నిర్మించినట్లు అక్కడ శాసనాలు సాక్షాలుగా ఉన్నాయి. విక్రమ సింహపురి మండలాన్ని పాలించిన మనుమ సిద్ధి తండ్రి తిరుకాళత్తి దేవుడు. ఆయనకు చరిత్ర ప్రకారం గండ గోపాలుడు అనే బిరుదు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న కామాక్షి దేవి సమేత మనుమ సిద్దేశ్వర స్వామి, రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయాలను వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించినట్లు ఆలయాల్లో ఉన్నటువంటి శిలా శాసనాలు ఆ భాషను బట్టి చెబుతున్నాయి. అప్పట్లో 18 దేశాల ప్రతినిధులు సమావేశమై ఆలయ అభివృద్ధికి ప్రణాళిక తీసుకువచ్చి శాసనాలు ఏర్పాటు చేశారని చరిత్ర సమాచారంగా ఉంది. సముద్ర తీర ప్రాంతం వెంబడి చక్కటి శిల్పకళా వైభవంతో ఈ రెండు ఆలయాలు పునరుద్ధరణ పనులకు పురుడు పోసుకున్నాయి. దేవతలచే ప్రతిష్టించబడి శ్రీరామచంద్ర చేత సేవించబడి మహాకవి శ్రీనాధుని చేత కీర్తింపబడి చోళులు, పల్లవులు పరిపాలనలో అతి వైభవంగా ఖ్యాతి గడిచినట్లు తెలుస్తుంది. అలాంటి ఆలయాలను మనుమసిద్ధి మహారాజు క్రీస్తుశకం 12- 13 శతాబ్దాల మధ్య ఈ దేవస్థానాలను పునర్నిర్మానం చేయాలని శాసనముల ద్వారా తెలియజేసి ఉన్న‌ట్లు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ దేవదాయ ధర్మాదాయ పరిధిలో ఉన్నటువంటి ఈ ఆలయాలు శిధిలావస్థకు చేరుకోవడంతో పునరుద్ధరణ పనులకు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టినాయి. ఈ నేపథ్యంలో 2017 సంవత్సరంలో రెండు ఆలయాల పునరుద్ధరణ పనులకు అప్పటి ప్రభుత్వం శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రాథమిక దశ పనులు చేపట్టిన తర్వాత ప్రభుత్వం మారడంతో ప్రస్తుత ప్రభుత్వం ఆలయ పునరుద్ధరణ పనులు వేగవంతంగా చేపట్టింది. తొలుత రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం గావించారు. ఎట్టకేలకు దాదాపుగా ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తి కావడం జరిగింది. సుమారు 13.5 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణిగోవర్ధన్ రెడ్డి సారధ్యంలో కాంట్రాక్టర్ ఈ పనులు పూర్తి చేయడం జరిగింది.

నేటి మహా కుంభాభిషేక మహోత్సవాలు
రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తి కావడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు నూతన శిలా విగ్రహ జీవద్వజ ప్రతిష్ట మహా కుంభాభిషేకం మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రానైట్ స్టోన్స్ తో నిర్మించబడిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి, సీతా లక్ష్మణ సమేత కోదండ రామస్వామి, ఆంజనేయస్వామి, మహాలక్ష్మి అమ్మవారు శిలా విగ్రహాలు ప్రతిష్టించబడతాయి. అదేవిధంగా ఏడు అంతస్తుల రాజగోపురము, పాకశాల, యాగశాల, మండపములు , విశాలమైన ప్రాకారము, గ్రానైట్ ఫ్లోరింగ్ , కార్యాలయ భవనములు ఇక్కడ నిర్మించి ఉండగా ప్రారంభోత్సవం చేస్తారు . మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాల్లో 35 మంది అర్చకులు పూజా కార్యక్రమాలు చేస్తారు. మొదటి రోజు తీర్థప్రసాద గోష్టి, వేద పారాయణ , సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. రెండో రోజు వేద పారాయణం, కార్యక్రమాలు, మూడోరోజు శిలా విగ్రహ , ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం, వేణుగోపాల స్వామి శాంతి కళ్యాణ మహోత్సవం, ఆదాని కృష్ణపట్నం పోర్ట్ వారిచే అన్నదానం, గ్రామోత్సవం తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ కుంభాభిషేక మహోత్సవాలకు విచ్చేసిన భక్తులకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి కుంభాభిషేకం మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కోవూరు జనార్దన్ రెడ్డి, ఆలయ పాలకమండలి చైర్మన్ పెద్దపాలెం సుబ్బయ్య, ధర్మకర్తలు సంయుక్తంగా ఏర్పాట్లను మెట్టాకు తెలియజేసినారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement