Monday, May 6, 2024

కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆ శాఖలో పెనుమార్పులు

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లా ఏర్పాటు ప్రక్రియ వేగతంతంగా సాగుతోంది. ఉగాది నుంచి కొల్లి జిల్లాల్లో పరిపాలన ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే, కొత్త జిల్లాల ఏర్పాటుతో సమాచార, పౌర సంబంధాల శాఖలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. తిరుమల, తిరుపతి, కర్నూలులో వున్న స్టేట్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్లు రద్దు కానున్నాయి. ఏప్రిల్‌ 2వ తేదీకల్లా వీటిని రద్దు చేసి ఆయా కేంద్రాల్లో అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా పనిచేస్తున్న అధికారులను కమిషరేట్‌లో రిపోర్టు చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.

మరోవైపు కొంతకాలంగా టెక్నికల్‌ విభాగం అధికారులు, సిబ్బందికి పెద్దగా పని లేకపోవడంతో వారిని పీఆర్వోలుగా సర్దుబాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ మార్పుచేర్పుల్లో భాగంగా చిత్తూరులో డిప్యూటీ డైరెక్టర్‌ కార్యాలయం అక్కడే కొనసాగుతుంది. కొత్త జిల్లా తిరుపతిలో ఆ హోదాలో టెక్నికల్‌ అధికారి పనిచేయనున్నారు. ప్రస్తుతం సమాచార శాఖ సాంకేతిక విభాగం చిత్తూరు ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా వున్న బాలకొండయ్య ఇకపై తిరుపతి జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారని సమాచారం. జిల్లా సమాచార శాఖ డీడీగా వున్న లీలావతికి మరో ఆరున్నరేళ్ళ పాటు సర్వీసు వున్నప్పటికీ స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారని, ప్రభుత్వం ఆమోదించిన నేపధ్యంలో ఈ నెలాఖరుకు రిటైరవుతున్నారని తెలిసింది. ఆ స్థానానికి తిరుపతి ఎస్‌ఐసీ ఏడీగా వున్న పద్మజ వెళ్ళే అవకాశముంది. చిత్తూరు డీపీఆర్వోగా రమణ కొనసాగనుండగా తిరుపతి డీపీఆర్వోగా విజయసింహారెడ్డి కొనసాగనున్నారు. ఏపీఆర్వోలుగా, ఫొటో గ్రాఫర్లుగా రెగ్యులర్‌ సిబ్బంది అందుబాటులో లేనందున, తిరుపతి జిల్లాలో ఆ శాఖపై విపరీతమైన ఒత్తిడి వుండే నేపధ్యంలో ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన అవసరమైన సిబ్బందిని నియమించుకునే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement