Friday, April 26, 2024

Big Story: అంగన్‌వాడీలకు ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌.. మాతా శిశు మరణాల తగ్గింపే లక్ష్యం

అమరావతి, ఆంధ్రప్రభ : అంగన్‌వాడీ వ్యవస్థలో కీలక సంస్కరణలు తీసుకువచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మరో కొత్త విధానం అమలుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో అమలు చేయనున్న ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా వర్తింపజేసే విధంగా సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహార పంపిణీ చేస్తూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ్‌ ప్లస్‌ పథకాలను అమలు చేస్తూ ఆసరాగా నిలుస్తున్నా ఇంకా మాతా శిశు మరణాలు సంభవించడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. గతంతో పోలిస్తే మాతా శిశు మరణాల రేటు తగ్గినప్పటికీ ఇంకా దాన్ని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తోంది.

ముఖ్యంగా శిశు మరణాలు ఇంకా సంభవిస్తున్న తరుణంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను అంగన్‌వాడీల్లో ప్రవేశపెట్టి పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించాలన్న ధృడ సంకల్పంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గడిచిన 6 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 326కి పైగా శిశు మరణాలు 10 నుంచి 15 వరకు తల్లుల మరణాలు సంభవించినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆరోగ్య పరిస్థితిపై గర్భిణీలకు సరైన అవగాహన లేకపోవడం, గర్భస్థ శిశువుకు సరైన పౌష్టికాలు లభించక ఎదుగుదల సక్రమంగా లేకపోవడం, తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం నిర్లక్ష్యం చేయడమేనని వైద్యనివేదికలు వెల్లడిస్తున్న తరుణంలో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది.

గర్భిణీలకు ఆరోగ్య పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహిం చే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. నవజాత శిశువుల మరణాలు అధికంగా సంభవిస్తున్న నేపథ్యంలో వీటిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు ఫ్యామిలీ డాక్టర్ల ద్వారా అంగన్‌వాడీల్లో గర్భిణీలు, బాలింతలకు పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, మరింత పౌష్టికాహారం అందించాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటి వరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతల ఆరోగ్యాన్ని ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పర్యవేక్షిస్తున్నారు. క్రమం తప్పకుండా అవసరమైన పరీక్షలు చేస్తూ మందులు, ఇతర పౌష్టికాలను అందిస్తున్నారు. అయినప్పటికీ అడపా దడపా మాతా శిశు మరణాలు రాష్ట్రవ్యాప్తంగా సంభవిస్తున్న పరిస్థితులు ఉండటంతో ఇప్పుడు ఆ పర్యవేక్షణా బాధ్యతలను ఫ్యామిలీ డాక్టర్లకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించి ఎప్పటికప్పుడు గర్భిణీల ఆరోగ్యాన్ని పరిశీలించాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. శారీరకంగా మానసికంగా ధృడంగా లేని గర్భిణీలు, బాలింతలను గుర్తించి వారికి అవసరమైన వైద్యాన్ని ఫ్యామిటీ డాక్టర్లు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాలకు సమీపంలో ఉన్న పీహెచ్‌సీలకు సంబంధించిన డాక్టర్లకు ఈ పర్యవేక్షణా బాధ్యతలను అప్పగించనున్నారు. గర్భిణీలు, బాలింతల ఆరోగ్య సమస్యలతో పాటు చిన్నారుల ఆరోగ్య పర్యవేక్షణ బాధ్యతలను కూడా వీరే నిర్వర్తించే విధంగా చర్యలు చేపట్టారు. వైద్యుల పర్యవేక్షణ ద్వారా మాతా శిశు మరణాలు పూర్తిగా అదుపులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి అవసరమైన మందులు ఉచితంగా అందిస్తూనే, ఇంకోకవైపు సమగ్ర పోషక ఆహారాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంగన్‌వాడీల్లో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్ట్‌ను వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేసేందుకు మహిళ శిశు సంక్షేమ శాఖకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నవజాత శిశువుల మరణాలు దాదాపుగా అదుపులోకి వస్తాయని అధికార యంత్రాంగం భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement