Sunday, April 28, 2024

Exclusive – ఇదే ఫైన‌ల్‌.. గెలుపు గుర్రాల‌కే అవ‌కాశాలు – జ‌గ‌న్

(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) – తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ.. దాదాపు పూర్తి స్థాయి సిట్టింగులతోనే ఎన్నికల బరిలోకి దూకి అడ్డంగా ప్రతిపక్ష పార్టీ చేతిలో ఓడిపోయి… అధికారాన్ని కోల్పోయింది. తెలంగాణ ఎన్నికలు అలా ముగిశాయో లేదో? ఏపీలో ప్రతిపక్ష పార్టీలు గంతులేశాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు బాగా పని చేసిందని, రైతు బంధు, ఉచిత కరెంటు.. ఇతర సంక్షేమ పథకాలు పని చేయలేదని, అలాగే ఊరింతలకూ జనం ఊగిపోలేదని ప్రతిపక్షాలు తెగ సంబర పడిపోయాయి. ఇక ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రజలు మార్పు కోరుతున్నారని గ్రహించారు. తన వ్యూహాన్ని మార్చారు. సిట్టింగ్ల్లో పనికి రానోళ్లనూ మర్యాదగా సాగనంపారు. మాట‌ వినని సిట్టింగులకు ఎంపీ సీట్ల పొగ పెట్టారు. వరుసగా జాబితాల మీద జాబితాలను విడుదల చేస్తున్నారు. ఆయా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో కొత్త ఇన్ చార్జీలను నియమిస్తున్నారు. తాజాగా వైసీపీ అధిష్టానం విడుదల చేసిన నాలుగో జాబితాను పరిశీలిస్తే..ఒక ఎంపీ, 8 అసెంబ్లీ సెగ్మెంట్లల్లో కొత్త నాయకులు కనిపించారు. అంటే.. ఒక ఎమ్మెల్యేను ఎంపీ స్థానానికి, ఎంపీని ఎమ్మెల్యే స్థానానికి బదిలీ చేయగా.. ఇద్దరు ఎమ్మెల్యేలను పక్కపక్క నియోజకవర్గాలకు మ్యూచ్ వల్ ట్రాన్స్ ఫర్ చేశారు. ఐదు అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగ్లను ఊస్టింగ్ చేశారు. అంటే సింగనమల, నందికొట్కూరు, మడకశిర, తిరువూరు, కనిగిరిలో కొత్త నేతలు వచ్చారు. ఇక్కడ సిట్టింగ్ లకు అవకాశం దక్కలేదు. కొవ్వూరు, గోపాలపురం సిట్టింగ్‌లను తారుమారు చేశారు. చిత్తూరు ఎంపీని – జీడీ నెల్లూరు అసెంబ్లీ ఇన్‌ఛార్జిగా, జీడీ నెల్లూరు ఎమ్మెల్యేని – చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా ప్రమోషన్ ఇచ్చారు.

రిజర్వుడు స్థానాలపైనే.. అధిష్టానం వేటు

అధిష్టానం ప్రకటించిన నాలుగో జాబితాలో కనిగిరి అసెంబ్లీ స్థానంలో మినహా.. మిగిలిన ఎనిమిది స్థానాలూ రిజర్వుడు సీట్లే. వీటిలో ఐదు తీసివేతలు… మూడు బదిలీలు ఉన్నాయి. అన్నీ ఎస్సీ స్థానాలు కావటం విశేషం. ఇందులోనూ మాల, మాదిగ కుల విభజన ఉన్నట్టు పొలిటికల్ అనాలసిస్. అధిష్టానం విడుదల చేసిన జాబితాను ఒకసారి పరిశీలిద్దాం. జీడీ నెల్లూరు (ఎస్సీ) అసెంబ్లీ సమన్వయకర్తగా – ఎన్‌. రెడ్డప్ప, శింగనమల (ఎస్సీ) – అసెంబ్లీ సమన్వయకర్తగా ఎం. వీరాంజనేయులు , తిరువూరు (ఎస్సీ) – అసెంబ్లీ సమన్వయకర్తగా నల్లగట్ల స్వామిదాసు , కొవ్వూరు (ఎస్సీ) అసెంబ్లీ సమన్వయకర్తగా – తలారి వెంకట్రావు, నందికొట్కూరు (ఎస్సీ)అసెంబ్లీ సమన్వయకర్తగా – సుధీర్‌ దార, మడకశిర (ఎస్సీ) – అసెంబ్లీ సమన్వయకర్తగా ఈర లక్కప్ప, కనిగిరి – అసెంబ్లీ సమన్వయకర్తగా దద్దాల నారాయణయాదవ్, గోపాలపురం (ఎస్సీ)అసెంబ్లీ సమన్వయకర్తగా – తానేటి వనిత (హోం మంత్రి), చిత్తూరు పార్లమెంట్‌ (ఎస్సీ) అసెంబ్లీ సమన్వయకర్తగా – కె. నారాయణస్వామిని నియమించారు. ఇప్పటివరకూ మొత్తం 10 ఎంపీ, 58 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్‌ఛార్జిలను ఖరారు చేశారు. మరో 12 మంది ఎంపీ అభ్యర్థులను మార్చుతారనీ, 5 లేదా 6 ఎమ్మెల్యే స్థానాల్లోనూ మార్పు ఉంటుందని అధిష్టాన వర్గాల భోగట్టా

ప్రతిపక్షాల వ్యంగ్యాస్త్రాలు

పని తీరులో గ్రాఫ్ పడిపోయిన సిట్టింగ్‌లకుఎన్నికల సమయంలో టికెట్లు ఇవ్వకుండా.. కొత్త నేతలను బరిలోకి దించటం పరిపాటే. కానీ .. భారీ సంఖ్యలో మార్పులు కారణంగా పరోక్షంగా సీఎం జగన్ పాలనతో ప్రతిపక్షాలు ముడిపెడుతున్నాయి. ప్రభుత్వ పాలన సరిగా ఉంటే, ఎమ్మెల్యేలు బాగా పనిచేసి ఉంటే, ఇప్పుడీ మార్పులెందుకని ప్రశ్నిస్తున్నాయి. ఇంతమందిని మార్చడంతో తన ప్రభుత్వ పరిపాలన సరిగా లేదని సీఎం జగన్ పరోక్షంగా అంగీకరిస్తున్నారని ప్రతిపక్షాలు సెటైర్లు విసురుతున్నాయి.

- Advertisement -

ముందే చెప్పినా.. సిట్టింగుల్లో మార్పు సున్నా

పనితీరు సరిగా లేని నేతలను పక్కన పెడతానని సీఎం జగన్ నాలుగు ఏళ్ల కిందటే చెప్పారు. అప్పటి నుంచి తరచూ ఎమ్మెల్యేల పనితీరు నివేదికలను రప్పించి.. పనితీరు సరిగా లేని సిట్టింగులకు వార్నింగ్స్ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోవడంతో..సీఎం జగన్ అప్రమత్తం అయ్యారు. పెర్ఫార్మెన్స్ బాగోని ఎమ్మెల్యేల విషయంలో రాజీ లేదని సీఎం జగన్ నిర్ణయాలు తేటతెల్లం చేస్తున్నాయి. అందువల్లే భారీ స్థాయిలోఈ మార్పులు-చేర్పులు జరుగుతున్నాయనే చర్చ నడుస్తోంది. ఎన్నికలకు ఇంకా 2 నెలలకు పైగా సమయం ఉంది. ఈలోపు సీఎం జగన్ ఇంకెన్ని మార్పులు చేస్తారన్నది సస్పెన్స్!

Advertisement

తాజా వార్తలు

Advertisement