Tuesday, May 7, 2024

Exclusive – ఎపి దేవాదాయ శాఖ‌లో అవినీతి పీఠాలు క‌దులుతున్నాయి..

అమరావతి, ఆంధ్రప్రభ: అదే ఆలయం.. సీటు కూడా ఒకటే..ఇంకేముంది. భక్తుల బాగోగులు పక్కనబెట్టి అందిన కాడికి దోచుకోవడం. కాంట్రాక్టర్లతో మిలాఖత్‌.. కొనుగోళ్లలో అవకతవకలు..దాతల సొమ్ము సొంత ఖజానాకు మళ్లింపు..ఇలా ఒకటేమిటి అనేక రూపాల్లో ఆలయ ఉద్యోగులు అడ్డగోలుగా ఆదాయం ఆర్జిస్తున్నారు. ఎంతలా అంటే ఏసీబీ అధికారులే విస్తుబోయేలా. 6(ఎ) ఆలయం గుమాస్తా కూడా రూ.లక్షల ఖరీదైన కార్లలో విధులకు వస్తున్నారంటే ఇక్కడ ఏ స్థాయి అవినీతికి పాల్పడుతున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వారిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో విధులు నిర్వహించే నాలుగో తరగతి ఉద్యోగి నుంచి సహాయ కార్యనిర్వహణాధికారి వరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి రొటేషన్‌ విధానంలో సీట్లు మార్చాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ గురువారం తాజా ఉత్తర్వులను జారీ చేశారు. ప్రత్యేక విధుల నిర్వహణ కోసం తీసుకునే ఔటు సోర్సింగ్‌ ఉద్యోగులను అదే విభాగంలోని మరో సీటుకు మార్చాలంటూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇదే సమయంలో ఇంజనీరింగ్‌, లీగల్‌, అకౌంట్స్‌, లీజుల వ్యవహారాలు చూసే వారికి మినహాయింపులు ఇచ్చారు.

కొండెత్తు ఆరోపణలు..
రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలే కాకుండా 6(ఎ) ఆలయాల్లో కూడా ఉద్యోగులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. సీటు కదలకుండా వచ్చిన అధికారులను ‘మేనేజ్‌’ చేసుకొని ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. ఇటీవల ఏసీబీ అధికారులు శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఆలయంలో పలు కీలక విభాగాలు పర్యవేక్షించే సూపరింటెండెంట్‌ వీ.నగేష్‌ ఆస్తులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున అక్రమాస్తులను గుర్తించారు. గతంలో ద్వారకా తిరుమల ఆలయంలో విధులు నిర్వహించే సమయంలో కూడా ఇతనిపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఇదే తరహాలో ప్రతి ఆలయంలోనూ కొందరు చక్రం తిప్పుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. వీరు ఎప్పుడూ కీలక స్థానాల్లోనే విధులు నిర్వహిస్తుంటారు. వీరికి అధికారులు మొదలు రాజకీయ నేతల వరకు అండదండలు ఉన్నాయి. గతంలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల ఆలయంలో నిర్వహించిన విజిలెన్స్‌ తనిఖీల్లో ఉద్యోగులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడటం వెలుగు చూసింది. ఈ క్రమంలోనే వీరిని వేర్వేరు ఆలయాలకు బదిలీ చేశారు. మూడు నెలలు కూడా తిరగకుండానే తిరిగి ఇక్కడికి పోస్టింగ్‌ తెచ్చుకోవడమే కాకుండా పాత స్థానాల్లోనే విధుల నిర్వహణ చేపట్టారు. ఒక్క ప్రధాన ఆలయాల్లోనే కాకుండా రూ.కోట్ల ఆదాయం వచ్చే ఆలయాల్లో వీరు ఇదే తరహా దందాలు నిర్వహిస్తున్నట్లు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా ఉన్నతస్థాయిలో చర్యలు శూన్యమేనని చెప్పొచ్చు.

ప్రభుత్వం సీరియస్‌..
రాష్ట్రంలోని ఆలయాల్లో విచ్చలవిడి అవినీతి, అక్రమాలపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇటీవల ఏసీబీ, విజిలెన్స్‌ విభాగాలకు ఆయా ఆలయాల్లో చోటు చేసుకుంటున్న అవినీతిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల తీరు ప్రభుత్వ పెద్దలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. భక్తులతో ముడిపడిన సున్నిత అంశాలు కావడంతో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించిన ప్రభుత్వం దేవదాయశాఖ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రొటేషన్‌ విధానంలో సీట్లు మార్పుపై ఆదేశాలు వెలువడినట్లు దేవదాయశాఖ వర్గాలు చెపుతున్నాయి.

రొటేషన్‌ విధానం..
రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలతో పాటు 6(ఎ) ఆలయాల్లో ఉద్యోగులను ప్రతి మూడు నెలలకోసారి రొటేషన్‌ విధానంలో సీట్లు మార్చాలంటూ దేవదాయశాఖ కమిషనర్‌ సత్యనారాయణ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఆలయం, ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, సింహాచలం, అన్నవరం, పెనుగంచిప్రోలు, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం సహా పదకొండు ప్రధాన ఆలయాలు ఉన్నాయి. ఇవే కాక రూ.25లక్షల పైబడి ఆదాయం ఉన్న 6(ఎ) ఆలయాలు 174 వరకు ఉండగా, మరో 28 వరకు సత్రాలు ఉన్నాయి. వీటిలో విధులు నిర్వహించే సహాయ కార్యనిర్వహణాధికారులు, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, రికార్డు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, నాలుగో తరగతి ఉద్యోగులతో పాటు శానిటేషన్‌, సెక్యూరిటీ విభాగాల్లో విధులు నిర్వహించే వారిని కూడా మార్చాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయంటూ పేర్కొన్న కమిషనర్‌..రాజమండ్రి, తిరుపతి ఆర్జేసీలను ఉత్తర్వుల అమలుపై నివేదిక పంపాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement