Thursday, July 25, 2024

Exclusive హుకుం చెల్ల‌దిక‌! ఎపిలో ఇప్పుడంతా గోవింద జపమే….

ఏపీలో ఇప్పటిదాకా జ‌గ‌న్ జ‌మానాలో సచీవులు.. కొత్వాల్ హోదాలో యథారాజా తథా బంట్రోతు తరహాలో హ‌వా సాగించిన అధికారుల గుండెల్లో ప్రస్తుతం రైళ్లు ప‌రెగెడుతున్నాయి. కార్పొరేట‌ర్‌ సైతం ఎదురుగా దర్జాగా కుర్చీలో కూర్చోని మీసం మెలేస్తూ హుకూం జారీ చేస్తే.. జీ హుజీర్ అంటూ అరాచకత్వానికి వంగివంగి సలాం చేసిన ఈ వజీర్లు.. చీ ఇదేం బతుకు అంటూ.. పారిపోయే పరిస్థితి ఏర్పడింది. బతికుంటే బలిసాకు తినొచ్చనే ఆలోచనతో అయ్యా.. క్షణం తీరిక లేకుండా పని చేశాం, కాస్త రెస్టు ఇవ్వండ‌ని కొత్త సర్కారు ఎదుట దీనంగా అభ్యర్థిస్తున్న సన్నివేశాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ జాబితా చాంతాడులా మారుతుండ‌డంతో క్షేత్ర స్థాయి ఉద్యోగుల్లో ఎక్క‌డ‌లేని సంబురం క‌నిపిస్తోంది.


ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: ఏపీలో కొత్త ప్రభుత్వం మరి కొన్ని గంటల్లో కొలువు తీరేందుకు రెడ అవుతోంది. ఈ తరుణంలో అనూహ్య పరిణామాలు జ‌రుగుతున్నాయి. అప్పుడే సర్కారు పాలన పగ్గాలు టీడీపీ అధినేత చంద్రబాబు చేతికి చిక్కాయి. ఇంకేముంది.. ఇప్పటి వరకూ తిరుగులేని తిమ్మరుసు పాత్ర పోషించిన అధికారులు తమకు తామే నెమ్మదిగా సెలవు పేరిట‌.. కుర్చీ ఖాళీ చేస్తున్నారు. ఇంత‌కుముందే ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌వ‌హ‌ర్‌రెడ్డిని లీవ్‌లో పంపారు. ఇప్పుడు టీటీడీ ఈవో ధర్మారెడ్డి సెలవుపై వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తోంది. బుధవారం ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబు ఫ్యామిలీ తిరుమల వెళ్లనుంది. 13వ తేదీన దర్శనం తర్వాత అమరావతికి వీరు వెళ్ల‌నున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మంగళవారం నుంచి వారం రోజుల పాటు ప్రభుత్వం సెలవు ఇచ్చేసింది. జేఈవో వీరబ్రహ్మానికి ఈవో బాధ్యతలను అదనంగా అప్పగించారు. చంద్రబాబు టూర్ సమయంలో ధర్మారెడ్డి దూరంగా ఉండనున్నారు.

- Advertisement -

అందుకే ధర్మారెడ్డిని దూరం పెట్టారా?

రక్షణ శాఖకు చెందిన ఐడీఈఎస్ అధికారి ధర్మారెడ్డి, వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. వైఎస్ హయాంలో టీటీడీలో ఓఎస్డీగా రెండుసార్లు డిప్యుటేషన్‌‌‌పై వచ్చారు. తిరిగి జగన్ ప్రభుత్వం వచ్చాక డిప్యుటేషన్‌పై మళ్లీ టీటీడీకి వచ్చారు. ఆయన టీటీడీలోకి వచ్చాక పెత్తనం మొదలైంద‌ని, శ్రీవారి దర్శనాలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వానికి అవసరమైన పనులు చేయించడానికి యత్నించారనే అప‌వాదు ఉంది. అంతేకాకుండా అక్కడి ఉద్యోగులతోపాటు పలువురు రాజకీయ నాయకులను ఆయన వేధించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డిని చంద్ర‌బాబు సర్కారు దూరంగా పెట్టినట్టు తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.

పాపం.. జవహర్ గయా..

ఎన్నికల సమయంలోనే ఏపీ ప్రధాన కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్‌రెడ్డిపై వేటు తప్పదని అందరూ భావించారు. అనేక ఆరోపణలు ఆయనను చుట్టిముట్టినా ఎన్నికల కమిషన్ జాలి చూపి వేటు వేయలేదు. ఇక.. తిరుగులేని మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వస్తుందన ఆశతో ఆయ‌న ఎదురుచూశారు. ఇంతలో సీన్ రివర్స్ కాగా.. ఏదో పొరబాటు జరిగిందని బాబును బతిమాలేందుకు యత్నించినా పని జరగలేదు. బలవంతపు సెలవుపై వెళ్లక తప్పలేదు. ఈనెల చివరిలో జవహర్‌రెడ్డి పదవీకాలం ముగియనుండడంతో ఈనెల 21న ఆయన విధులకు హాజరుకానున్నారు. నెలాఖరకు అన్నీ సర్దుకుని వెళ్లిపోతారు. కానీ, ఈలోపునే విశాఖలో భూ కుంభకోణం నిందను ఆయన మూటగట్టుకోవటంతో.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయ‌నేది మిస్టరీగా మారింది.

లెక్కలు తేలాల్సిందేనా..

ధర్మారెడ్డి విషయంలోనే కాకుండా కేంద్రం నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులను, పొరుగు రాష్ట్రాల నంఉచి వచ్చిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సైతం ప్రస్తుతం బాధ్యతల నుంచి పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఆయా అధికారులు తమ శాఖలకు వెళ్లిపోవడానికి యత్నించారు. కాకపోతే సీఎస్ వీరికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. గడిచిన అయిదేళ్లలో జ‌రిగిన ప‌నుల‌కు లెక్కలు చెప్పాల్సిందేనని సీరియ‌స్ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement